Election controversy: ఎన్నికల్లో భార్య ఓడిపోయిందని వీధి దీపాలు పీకేయించిన ఎమ్మెల్యే పీఏ..!
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో తన భార్య ఓడిపోయిందన్న కోపంతో ఎమ్మెల్యే పీఏ వీధి దీపాలను తొలగించడం వివాదాస్పదమైంది.
Election controversy: ఎన్నికల్లో భార్య ఓడిపోయిందని వీధి దీపాలు పీకేయించిన ఎమ్మెల్యే పీఏ..!
Rajasthan: రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, ఎన్నికల్లో తన భార్యను ఓడించారన్న కోపంతో ఓ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు గ్రామంలోని వీధి దీపాలను తొలగించడం రాజస్థాన్‌లో తీవ్ర కలకలం రేపింది. ఒకవైపు ఇది పక్కా కక్ష సాధింపు చర్య అని గ్రామస్తులు మండిపడుతుండగా, మరోవైపు అవి అక్రమ కనెక్షన్లు కావడం వల్లే తొలగించామని విద్యుత్ అధికారులు సమర్థించుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా పీప్లూ పంచాయతీ సమితి పరిధిలోని వార్డు 4 లో ఉన్న రనోలి గ్రామ పంచాయతీలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. అంతకుముందు నివాయ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రామ్ సహాయ్ వర్మ పీఏ అలోక్ శర్మ చొరవతో కుమ్హారోం కీ ధానీ, బేగంపుర, హనీఫ్గంజ్, బిజల్‌పుర గ్రామాల్లోని విద్యుత్ స్తంభాలకు సుమారు 50 ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. అయితే, తాజాగా జరిగిన పంచాయతీ సమితి ఎన్నికల్లో వార్డు 4 నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అలోక్ శర్మ భార్య ప్రియాంక శర్మ ఓటమి పాలయ్యారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయా గ్రామాల్లో వీధి దీపాలను తొలగించే ప్రక్రియ మొదలైంది. జైపూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన ఫాల్ట్ రిపేర్ టీమ్ సిబ్బంది గ్రామాలకు చేరుకుని స్తంభాలపై ఉన్న లైట్లను తొలగించడం ప్రారంభించారు. దీంతో ఎన్నికల్లో ఓడించారన్న కక్షతోనే పీఏ ఈ పని చేయిస్తున్నారంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు.
గ్రామస్తుల నిరసనల మధ్యే కుమ్హారోం కీ ధానీ గ్రామంలో సుమారు 10 స్తంభాల నుంచి లైట్లను సిబ్బంది తొలగించారు. అయితే, మిగిలిన సుమారు 40 స్తంభాల లైట్లకు అయ్యే విద్యుత్ బిల్లులను తాము చెల్లిస్తామని కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ముందుకు రావడంతో అధికారులు మిగతా లైట్ల తొలగింపును నిలిపివేశారు.
ఈ వివాదంపై JVVNL ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీఆర్ మీనా స్పందిస్తూ.. విద్యుత్ మరమ్మతుల కోసం వెళ్లిన తమ సిబ్బందికి స్తంభాలకు అనధికారికంగా లైట్లు అమర్చిన విషయం కనిపించిందని తెలిపారు. తనిఖీల్లో అవి అక్రమ కనెక్షన్లని తేలడంతోనే తొలగించామని, దీనిపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు.
మరోవైపు, ఎమ్మెల్యే రామ్ సహాయ్ వర్మ రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలను తోసిపుచ్చారు. దీపావళికి ముందు అభ్యర్థులు ఆ లైట్లను ఏర్పాటు చేశారని, విద్యుత్ బిల్లుల సమస్య తలెత్తడంతోనే JVVNL అధికారులు వాటిని తొలగించేందుకు వచ్చారని ఆయన వివరణ ఇచ్చారు. సర్పంచులు బిల్లులు కడతామని అంగీకరించడంతో మిగిలిన లైట్ల తొలగింపు ఆగిపోయిందని తెలిపారు. కారణాలు ఏవైనా, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే లైట్లు తొలగించడంపై ఆయా గ్రామాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.




