Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు షాక్.. రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసు పంపిన బీజేపీ!

Omar Abdullah: జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది.

Arun Chilukuri
Published on: 13 July 2026 2:53 PM IST
Omar Abdullah
X

Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు షాక్.. రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసు పంపిన బీజేపీ!

Omar Abdullah: జమ్మూకశ్మీర్ రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర వేడెక్కాయి. అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (NC), ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం కాస్తా కోర్టు నోటీసుల వరకు వెళ్లింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తమ పార్టీపై చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర బీజేపీ విభాగం.. ఆయనకు రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా నోటీసులు పంపింది. ఏడు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇటీవల శ్రీనగర్‌లో నిర్వహించిన ఒక పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లోబరుచుకోవడానికి బీజేపీ నాయకులు ఒక్కొక్కరికి రూ. 20 నుంచి రూ. 30 కోట్ల నగదు, మంత్రి పదవులు, అలాగే జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ వంటి ఆఫర్లను ఇరజల్లారని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఎంపీ సత్పాల్ శర్మ తీవ్రంగా మండిపడ్డారు. ఒమర్ అబ్దుల్లా చేస్తున్నవన్నీ పూర్తిగా అవాస్తవాలు, అసత్య ఆరోపణలని కొట్టిపారేశారు. బీజేపీ ప్రతిష్ఠను, ప్రతిపత్తిని ప్రజల్లో దిగజార్చేందుకే సీఎం ఈ రకమైన కుయుక్తులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీ తరఫున లాయర్ల ద్వారా పంపిన ఈ మూడు పేజీల లీగల్ నోటీసులో సత్పాల్ శర్మ కీలక డిమాండ్లు ఉంచారు. సీఎం ఒమర్ అబ్దుల్లా తాను చేసిన ఆరోపణలను రాతపూర్వకంగా వెనక్కి తీసుకోవాలి. నోటీసు అందిన 7 రోజుల్లోగా ఎలాంటి నిబంధనలు లేకుండా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ ఆరోపణలు నిజమైతే, ఆఫర్ ఇచ్చిన సదరు బీజేపీ నేత పేరు, ఆఫర్ తీసుకున్న ఎమ్మెల్యే పేర్లను బహిరంగంగా బయటపెట్టాలని సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం చెల్లదని బీజేపీ స్పష్టం చేసింది. ఈ 7 రోజుల గడువులోగా ఒమర్ అబ్దుల్లా స్పందించి క్షమాపణ చెప్పకపోతే.. సివిల్ మరియు క్రిమినల్ చట్టాల కింద న్యాయస్థానంలో రూ. 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ అధికారికంగా పరువు నష్టం దావా కేసు నమోదు చేస్తామని బీజేపీ హెచ్చరించింది. ఈ పరిణామం ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story