BluSmart : బ్లూస్మార్ట్‌కు CBI షాక్.. రూ.672 కోట్ల స్కామ్‌పై FIR.!
దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ రైడ్-హెయిలింగ్ (ఈవీ ట్యాక్సీ) సర్వీస్ అయిన 'బ్లూస్మార్ట్' మాతృసంస్థలు, దాని వ్యవస్థాపకులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కేసు..
blusmart
దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ రైడ్-హెయిలింగ్ (ఈవీ ట్యాక్సీ) సర్వీస్ అయిన 'బ్లూస్మార్ట్' మాతృసంస్థలు, దాని వ్యవస్థాపకులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కేసు నమోదు చేసింది. ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (IREDA) ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూ. 672 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని, భారీ ఫోర్జరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో జెన్‌సోల్ ఇంజనీరింగ్, దాని అనుబంధ సంస్థ జెన్‌సోల్ ఈవీ లీజ్‌తో పాటు బ్లూస్మార్ట్ వ్యవస్థాపకులు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది.
అసలు ఏం జరిగింది? లోన్ల వ్యవహారం ఏంటి?
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి, బ్లూస్మార్ట్ ట్యాక్సీ సర్వీస్ కోసం వాటిని వినియోగించేందుకు గాను జెన్‌సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, జెన్‌సోల్ ఈవీ లీజ్ లిమిటెడ్ సంస్థలు IREDA నుంచి వందల కోట్ల రూపాయల రుణాలు పొందాయి. అయితే, ఏ అవసరం కోసం అయితే రుణాలు మంజూరు చేశారో, ఆ నిధులను అందుకోసం వాడకుండా పూర్తిగా పక్కదారి పట్టించారని IREDA తమ ఫిర్యాదులో పేర్కొంది. జెన్‌సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ రూ. 453.77 కోట్లు, జెన్‌సోల్ ఈవీ లీజ్ లిమిటెడ్ రూ. 218.97 కోట్ల నిధులను మళ్లించినట్లు గుర్తించారు. వడ్డీ, ఇతర రుసుములు కాకుండానే ఈ ప్రాథమిక నష్టం మొత్తం రూ. 672.74 కోట్లుగా తేలింది.
ఫోర్జరీ పత్రాలతో క్రెడిట్ రేటింగ్ సంస్థలకు బురిడీ
ఈ కేసులో అత్యంత తీవ్రమైన అంశం ఏంటంటే ఫోర్జరీ పత్రాల వ్యవహారం. రుణాలు తీసుకున్న సంస్థలు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు కొన్ని నకిలీ పత్రాలను సమర్పించాయి. లోన్ల స్టేటస్, రేటింగ్ ఉపసంహరణలకు సంబంధించి అవి IREDA అధికారికంగా జారీ చేసినట్లుగా ఉన్న లేఖలను చూపించాయి. అయితే, ఆ లేఖలను తాము అసలు జారీ చేయలేదని, అవన్నీ ఫోర్జరీ సర్టిఫికెట్లు అని IREDA సీబీఐకి తెలిపింది. తమ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి క్రెడిట్ రేటింగ్‌లను అక్రమంగా మేనేజ్ చేశారని తీవ్ర స్థాయిలో ఆరోపించింది.
ఫొరెన్సిక్ ఆడిట్‌లో షాకింగ్ నిజాలు
విషయం అనుమానాస్పదంగా మారడంతో చేపట్టిన ఫొరెన్సిక్ ఆడిట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈవీ కార్ల కొనుగోలు కోసం మంజూరు చేసిన రుణాలను కంపెనీలు తమ సొంత సంబంధిత సంస్థలకు రుణాలుగా, అడ్వాన్సులుగా మళ్లించినట్లు తేలింది. అంతేకాకుండా పాత అప్పులు తీర్చడానికి, ఇతర వ్యాపార అవసరాలకు ప్రభుత్వ నిధులను అక్రమంగా వినియోగిస్తూ లోన్ మంజూరు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. కేవలం IREDA మాత్రమే కాకుండా, ఈ కంపెనీలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC), కెనరా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి మరో 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున రుణాలు పొందినట్లు సీబీఐ దర్యాప్తులో స్పష్టమైంది.
భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు
IREDA ఫిర్యాదు ఆధారంగా, సీబీఐ అధికారులు కొత్త నేర చట్టం అయిన భారతీయ న్యాయ సంహిత (BNS) కింద తీవ్రమైన సెక్షన్లలో కేసు నమోదు చేశారు. ఇందులో క్రిమినల్ కుట్ర, మోసం, మోసం చేసే ఉద్దేశంతో ఫోర్జరీకి పాల్పడటం, నకిలీ పత్రాలను అసలైనవిగా చలామణి చేయడం వంటి సెక్షన్లను చేర్చారు. కాగా, సీబీఐ నమోదు చేసిన కేసుపై, తమపై వచ్చిన ఆరోపణలపై జెన్‌సోల్, బ్లూస్మార్ట్ యాజమాన్యం గానీ, అన్మోల్ సింగ్, పునీత్ సింగ్ జగ్గీలు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందనా ఇవ్వలేదు. భారీ ఎత్తున ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టడం వల్ల త్వరలోనే సీబీఐ అధికారులు వీరికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు ఉన్నాయి.




