Mumbai: బిగ్ బీ, దిల్జిత్‌లకు 'ఖలిస్థాన్' బెదిరింపు మెయిల్: అమితాబ్ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత!

Mumbai: అమితాబ్ బచ్చన్ నివాసం జల్సాపై గ్రెనేడ్ దాడి, దిల్జిత్ దొసాంజ్ కచేరీలో ఆత్మాహుతి దాడి చేస్తామని బీఎంసీకి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Arun Chilukuri
Published on: 23 Oct 2026 3:59 PM IST
Mumbai
X

Mumbai: బిగ్ బీ, దిల్జిత్‌లకు 'ఖలిస్థాన్' బెదిరింపు మెయిల్: అమితాబ్ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత!

Mumbai: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరియు ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దొసాంజ్‌లను లక్ష్యంగా చేసుకుని వచ్చిన ఒక భయానక బెదిరింపు ఈమెయిల్ వాణిజ్య రాజధాని ముంబైలో తీవ్ర కలకలం రేపింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నివాసంపై గ్రెనేడ్‌తో దాడి చేస్తామని, దిల్జిత్ దొసాంజ్ సంగీత కచేరీలో ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ ఆగంతకులు పంపిన మెయిల్‌తో ముంబై పోలీసులు మరియు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అప్రమత్తమయ్యారు.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రధాన కార్యాలయంతో పాటు ముంబై మేయర్ రీతూ తవ్డే కార్యాలయానికి ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. 'స్మిత్ జాన్సన్' అనే వ్యక్తి పేరుతో, 'ఖలిస్థాన్' అనే పదాన్ని సబ్జెక్టుగా పెట్టి ఈ మెయిల్‌ను పంపినట్లు అధికారులు గుర్తించారు.

ఈ ఈమెయిల్‌లో జుహూలోని అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా'పై గ్రెనేడ్లతో దాడి చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి తోడు నవంబర్ 27న మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో జరగనున్న దిల్జిత్ దొసాంజ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో మానవ బాంబుతో ఆత్మాహుతి దాడికి తెగబడతామని హెచ్చరించారు. ఈ రెండింటితో పాటు కొన్ని ప్రముఖ పాఠశాలలు మరియు మేయర్ కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేస్తామని మెయిల్‌లో ఉండటం గమనార్హం.

ఈమెయిల్ అందిన వెంటనే బిఎంసి అధికారులు ముంబై పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలు అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా' వద్ద, అలాగే మహాలక్ష్మి రేస్‌కోర్స్ ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అయితే, సోదాల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు ధ్రువీకరించారు. అయినప్పటికీ, దీనిని తీవ్రమైన భద్రతా ముప్పుగా పరిగణించి అమితాబ్ నివాసం వద్ద భద్రతను భారీగా పెంచారు.

ఇటీవల అక్టోబర్ 30న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగాల్సిన దిల్జిత్ దొసాంజ్ సంగీత కచేరీకి భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ ఘటన జరిగి కొద్ది రోజుల్లోనే ముంబైలో సైతం ఇలాంటి సంచలన బెదిరింపు రావడంతో అభిమానులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ ఈమెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది? దీని వెనుక ఉన్నది ఎవరు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.