Vijay Mallya: విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు షాక్: "ముందు భారత్‌కు రండి.. తరవాతే విచారణ!"

Vijay Mallya: పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టాన్ని సవాలు చేస్తూ విజయ్ మాల్యా వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Arun Chilukuri
Published on: 13 Aug 2026 4:56 PM IST
Vijay Mallya
X

Vijay Mallya: విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు షాక్: "ముందు భారత్‌కు రండి.. తరవాతే విచారణ!"

Vijay Mallya: బ్యాంకులను వేల కోట్ల రూపాయల్లో ముంచి విదేశాల్లో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ బారన్ విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం’ (Fugitive Economic Offenders Act) చట్టబద్ధతను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపేందుకు ధర్మాసనం తెగేసి చెప్పింది. ఆయన ఎప్పుడు భారత్‌కు తిరిగి వస్తారో స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తే తప్ప ఈ పిటిషన్‌ను విచారించబోమని ముంబై హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.

విదేశాల్లో తలదాచుకుంటూ, భారతీయ న్యాయస్థానాల పరిధికి లొంగకుండా క్రిమినల్ బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. "మీరు మొదట భారతదేశానికి తిరిగి రావాలి.. మీరు స్వయంగా రానప్పుడు మీ తరఫున వేసిన పిటిషన్‌ను వినలేము. భారత్‌కు తిరిగొస్తేనే సమస్యకు సరైన పరిష్కారం చూపుతాము" అని స్పష్టం చేస్తూ, మాల్యా ఎప్పుడు తిరిగొస్తారో ఖచ్చితమైన టైమ్‌లైన్‌తో కూడిన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విదేశాల్లో ఉంటూ రాజ్యాంగబద్ధతను సవాలు చేసే పిటిషన్లను, ఇతర వ్యాజ్యాలను ఒకేసారి కొనసాగించలేమని స్పష్టం చేసింది.

ఈ విచారణ సందర్భంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తరఫున వాదనలు వినిపించిన కేంద్ర సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి పలు ముఖ్య విషయాలను తీసుకెళ్లారు. పరారీలో ఉన్న నేరస్థులు దేశం దాటి వెళ్లిపోయి, ఇక్కడ విచారణకు సహకరించకుండా కోర్టుల ద్వారా ఉపశమనం పొందకుండా 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం-2018'లోని సెక్షన్ 14 కట్టడి చేస్తుందని తెలిపారు.

బ్రిటన్ (UK) నుంచి మాల్యాను భారత్‌కు అప్పగించే (Extradition) ప్రక్రియ ప్రస్తుతం ఆఖరి దశకు చేరుకుందని, ఇలాంటి సవాలు పిటిషన్లతో ఆ చట్టపరమైన ప్రక్రియకు ఆటంకం కలిగించకూడదని సోలిసిటర్ జనరల్ కోరారు. తుది నిర్ణయానికి వాయిదా వేసిన హైకోర్టు... మాల్యా తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటారా? లేక భారత్‌కు తిరిగొచ్చే తేదీని ఖరారు చేస్తూ అఫిడవిట్ ఇస్తారా? అని ప్రశ్నిస్తూ విచారణను వేరే తేదీకి వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story