BRICS Summit 2026 : బ్రిక్స్ సమిట్ వేళ ఢిల్లీలో హైఅలర్ట్.. మెట్రో స్టేషన్లలో భారీ మాక్ డ్రిల్స్
BRICS Summit 2026 :దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో జరగనున్న BRICS సమిట్ 2026 సదస్సు నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. భద్రతా సిద్ధతను
BRICS-Summit-2026
BRICS Summit 2026 :దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో జరగనున్న BRICS సమిట్ 2026 సదస్సు నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. భద్రతా సిద్ధతను సమీక్షించుకోవడంలో భాగంగా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సహా పలు అత్యవసర విభాగాల ప్రతినిధులు నగరంలోని కీలక మెట్రో స్టేషన్లలో ఉమ్మడిగా భారీ మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
ఉగ్రదాడి జరిగితే ఎలా స్పందించాలి?
అకస్మాత్తుగా తీవ్రవాద దాడులు జరిగినా లేదా అనుమానాస్పద వస్తువులు లభ్యమైనా ఎంత వేగంగా స్పందించాలో పరీక్షించేందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. జమా మసీద్, సుప్రీంకోర్ట్, ధౌలా కువాన్, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్లలో ఈ విన్యాసాలు సాగాయి. జమా మసీద్ స్టేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేసినట్లు, సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్‌లో ఉగ్రవాదులను చుట్టుముట్టి మట్టుబెట్టడం , గాయపడిన ప్రయాణికులను అత్యవసర అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించడం వంటి దృశ్యాలను కృత్రిమంగా సృష్టించి ప్రాక్టీస్ చేశారు.
అనుమానాస్పద బ్యాగులు కనిపిస్తే...
ధౌలా కువాన్ , ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్లలోని ఉచిత ప్రవేశ ప్రాంతాల్లో (Unpaid Areas) యజమానులు లేని అనుమానాస్పద బ్యాగులు కనిపిస్తే ఎలా స్పందించాలనే దానిపై డ్రిల్ చేపట్టారు. సమాచారం అందుకోగానే ప్రయాణికులను ఖాళీ చేయించడం, ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకోవడం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం వంటి ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించారు.
అన్ని రక్షణ విభాగాల భాగస్వామ్యం
ఈ బృహత్తర విన్యాసాల్లో ఢిల్లీ పోలీస్, మెట్రో పోలీస్, సిఐఎస్ఎఫ్, ఫైర్ సర్వీస్, సిఏటిఎస్ అంబులెన్స్, పారాలెగల్ అండ్ ఫోరెన్సిక్ టీమ్స్, ట్రాఫిక్ పోలీస్, స్పెషల్ సెల్ , ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ విభాగాల మధ్య సమాచార మార్పిడి, ప్రతిస్పందన సమయం, బాధితులను తరలించే వేగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
బిఆర్ICS సమిట్ కోసం కట్టుదిట్టమైన భద్రత
రాజధానిలో లక్షలాది మంది ప్రయాణించే ఢిల్లీ మెట్రో భద్రత చాలా కీలకమైనది. బిఆర్ICS సమిట్ 2026 నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్రమం తప్పకుండా చేసే ఇలాంటి మాక్ డ్రిల్స్ వల్ల లోటుపాట్లను సరిదిద్దుకుని, అత్యవసర సమయాల్లో వేగంగా ప్రాణాలు కాపాడేందుకు వీలవుతుందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.




