Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Cauvery Water Dispute: కావేరీ నదీ జలాల విడుదలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 17 Aug 2026 2:51 PM IST
Cauvery Water Dispute
X

Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Cauvery Water Dispute: సుదీర్ఘకాలంగా నలుగుతున్న కావేరీ నదీ జలాల పంపిణీ వివాదంపై అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) ఇచ్చే ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం కచ్చితంగా పాటించి తీరాల్సిందేనని తేల్చిచెప్పింది. తమిళనాడుకు నీటి విడుదల, ప్రస్తుత నీటి లభ్యత మరియు డ్యామ్‌ల నిల్వలపై సమగ్ర స్టేటస్ రిపోర్ట్‌ సమర్పించాలని కావేరీ అథారిటీని ధర్మాసనం ఆదేశించింది.

తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆగస్టు 12, 13 తేదీల నుంచి 15 రోజుల పాటు రోజుకు 12,000 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని సిడబ్ల్యూఎంఏ ఆదేశించిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదుల వాదనలు కోర్టు వింది.

తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. కర్ణాటక జలాశయాల్లో 76 శాతం నీటి నిల్వ ఉన్నప్పటికీ, తమిళనాడుకు రావాల్సిన 64 టీఎంసీలకు గాను కేవలం 14 టీఎంసీలు మాత్రమే అందించారని తెలిపారు. దీనివల్ల రైతులకు సాగునీరు అందించలేకపోతున్నామని, దామాషా ప్రకారం దక్కాల్సిన నీటిని వెంటనే విడుదల చేసేలా ఆదేశించాలని కోరారు.

కర్ణాటక తరఫున ప్రతినిధి శ్యామ్ దివాన్ వాదిస్తూ.. కావేరీ పరివాహక ప్రాంతంలో నీటి ఎద్దడి ఉన్నప్పటికీ, సిడబ్ల్యూఎంఏ ఆదేశాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 17న (నేడు) ఉదయం 8 గంటల సమయానికి బిలిగుండులు వద్ద ప్రవాహం 12,607 క్యూసెక్కులకు చేరి నిబంధనల స్థాయిని దాటిందని, తమిళనాడు ఆరోపిస్తున్నట్లు ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేశారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ప్రస్తుతం తమిళనాడుకు నీటి ప్రవాహం తగినంతగానే అందుతున్నందున తక్షణమే ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించింది. అయితే, సిడబ్ల్యూఎంఏ ఆదేశాల అమలును కర్ణాటక యథాతథంగా కొనసాగించాలని తేల్చిచెప్పింది. ఇరు రాష్ట్రాల నీటి నిల్వలు, వర్షపాతం, హైడ్రోలాజికల్ డేటాతో సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ, తదుపరి విచారణను ఆగస్టు 24కి వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story