Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రైవేట్ సంస్థల పిటిషన్ కొట్టివేత!

Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Arun Chilukuri
Published on: 22 Sept 2026 2:39 PM IST
Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రైవేట్ సంస్థల పిటిషన్ కొట్టివేత!
X

Cauvery Water Dispute: తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య ఎప్పట్నుంచో నడుస్తున్న కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకకు అదనంగా 70 టీఎంసీల నీరు కేటాయించాలని కోరుతూ ఓ ప్రైవేటు సంస్థ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతర్రాష్ట్ర నీటి పంపిణీ వివాదాల్లో థర్డ్ పార్టీలు, ప్రైవేటు సొసైటీలు జోక్యం చేసుకోవడానికి వీలే లేదని స్పష్టం చేసింది.

ఇలాంటి ప్రైవేటు పిటిషన్లను విచారిస్తూ పోతే రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఎప్పటికీ ముగియవని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కావేరీ జలాల అంశంపై తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ఇప్పటికే చట్టపరమైన పోరాటాలు సాగిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ వివాదంలో ఎలాంటి ప్రైవేటు సొసైటీలకు లేదా థర్డ్ పార్టీలకు ఎలాంటి స్థానం ఉండదని, కేవలం సంబంధిత రాష్ట్రాలకే మాట్లాడే పూర్తి హక్కు ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది.

కావేరీ బేసిన్‌లో నీటి లభ్యత, వర్షపాత పరిస్థితులను క్షుణ్ణంగా సమీక్షించిన కావేరీ నదీజలాల నిర్వహణ అథారిటీ.. తమిళనాడుకు 15 రోజుల పాటు రోజూ 3,500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని జులై 28న కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడంతో తమిళనాడుకు నీటి విడుదలను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు, కన్నడ సంఘాలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.