Central Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన..? నిర్మలా సీతారామన్‌కు శాఖ మార్పు, శక్తికాంత్ దాస్ ఎంట్రీ!

Central Cabinet Reshuffle: మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు, చేర్పులు జరగనున్నాయనే చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది.

Arun Chilukuri
Published on: 26 Jun 2026 12:54 PM IST
Central Cabinet Reshuffle
X

Central Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన..? నిర్మలా సీతారామన్‌కు శాఖ మార్పు, శక్తికాంత్ దాస్ ఎంట్రీ!

Central Cabinet Reshuffle: దేశ రాజధాని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఒకే ఒక్క చర్చ ఇప్పడు దావానలంలా మండుతోంది. కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే ఊహించని విధంగా భారీ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) జరగబోతోందనే వార్త రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. జూన్ 28 (ఆదివారం) లేదా జూన్ 29 (సోమవారం) లలోనే ఈ మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుల ప్రక్రియ ముగిసిపోనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి భవన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, తెరవెనుక కసరత్తులు మాత్రం ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఈ కేబినెట్ మార్పుల తేదీలపై చర్చించారనే లీకులు ఢిల్లీ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

ఈసారి బీజేపీ అధిష్ఠానం ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. యువత, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) వర్గాల ఆశయాలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్‌లో కొత్త ముఖాలకు, యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలని భావిస్తోంది. పనితీరు (Performance) ఆధారంగా రిపోర్ట్ కార్డ్ తయారు చేసిన అధిష్ఠానం.. ఆశించిన స్థాయిలో రాణించని దాదాపు అరడజను మంది కేంద్ర సహాయ మంత్రులతో (MoS) పాటు కొందరు సీనియర్లను తప్పించేందుకు సిద్ధమైనట్లు టాక్.

ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురిల పేర్లు ఈ ఎగ్జిట్ లిస్ట్‌లో బలంగా వినిపిస్తున్నాయి. కాగా, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్‌కు మళ్లీ కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత కీలకమైన మార్పు ఆర్థిక శాఖలో జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ను విద్యాశాఖకు మార్చాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో దేశ ఆర్థిక రంగాన్ని నడిపేందుకు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్‌ను కేబినెట్‌లోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని చర్చ నడుస్తోంది.

రాబోయే రోజుల్లో కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా ఎన్‌డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలకు కేబినెట్‌లో ప్రాధాన్యత పెంచనున్నారు. మహారాష్ట్ర నుంచి శివసేన (షిండే వర్గం) ఎంపీ శ్రీకాంత్ షిండేకు కేబినెట్ హోదా దక్కే అవకాశం ఉంది. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించే అంశంపైనా రహస్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

వీరితో పాటు అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్ధన్ సింగ్ సిగ్రీవాల్, తరుణ్ చుగ్ ల పేర్లు కొత్త మంత్రుల రేసులో ముందంజలో ఉన్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సహాయ మంత్రి పంకజ్ చౌదరిని తప్పించే అవకాశం ఉంది. అలాగే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వద్ద ఉన్న విద్యుత్ శాఖను, ప్రతాప్‌రావు జాదవ్ వద్ద ఉన్న ఆరోగ్య శాఖ సహాయ మంత్రి బాధ్యతలను మార్చే యోచనలో మోదీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వీకెండ్‌లో ఢిల్లీ రాజకీయాల్లో ఎలాంటి కుదుపులు వస్తాయో చూడాలి!

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story