Cough Syrup: దగ్గు మందులపై కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకపై అది కంపల్సరీ!

Cough Syrup: జలుబు, దగ్గు వస్తే మెడికల్ షాపుకు వెళ్లి ఇష్టమొచ్చిన సిరప్‌లు కొంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.

Ravi
By Ravi
Published on: 16 Jun 2026 2:35 PM IST
Cough Syrup
X

Cough Syrup: దగ్గు మందులపై కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకపై అది కంపల్సరీ!

Cough Syrup: జలుబు, దగ్గు రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి నచ్చిన దగ్గు సిరప్ కొనుగోలు చేయడం మనలో చాలామందికి అలవాటు. కానీ ఇకపై అలా చేయడానికి వీల్లేదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి దగ్గు సిరప్‌లు, ఇతర సిరప్ మందులను విక్రయించరాదని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఇకపై మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌లు కొనుగోలు చేయాలంటే కచ్చితంగా రిజిస్టర్డ్ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే. ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించే పద్ధతికి కేంద్రం స్వస్తి పలికింది. ఈ మేరకు జూన్ 9, 2026న 'డ్రగ్స్ (ఐదవ సవరణ) రూల్స్, 2026' ద్వారా 1945 డ్రగ్స్ చట్టంలో కీలక సవరణలు చేసింది. డ్రగ్స్ చట్టంలోని 'షెడ్యూల్ K' జాబితా నుంచి "సిరప్‌లు" అనే పదాన్ని కేంద్రం తొలగించింది.

అయితే దగ్గు కోసం ఉపయోగించే మాత్రలు, పిల్స్, లాజెంజెస్‌ను మాత్రం ఈ జాబితా నుంచి మినహాయించారు. వీటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా యథావిధిగా కొనుగోలు చేయవచ్చు.

ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైద్య నిపుణులు సమర్థిస్తున్నారు. దగ్గు సిరప్‌లను వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా వాడటం వల్ల, ముఖ్యంగా చిన్నపిల్లల్లో తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల సిరప్‌లలో ఉండే కోడైన్ లాంటి పదార్థాల వల్ల యువత వాటికి బానిసలయ్యే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఇలాంటి దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ వివేక్ జైన్ తెలిపారు.

కాగా, గతంలో కలుషితమైన దగ్గు సిరప్‌ల కారణంగా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. వీటన్నింటి దృష్ట్యా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ పకడ్బందీ చర్యలు చేపట్టింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story