SBN banned India: షహజాద్‌ భట్టీ నెట్‌వర్క్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..!

SBN banned India: భారత్‌లో పలు సంచలన హత్యలకు కుట్ర పన్ని, అక్రమ ఆయుధాల రవాణా చేస్తున్న షహజాద్‌ భట్టీ నెట్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టం కింద నిషేధించింది.

Gagan kumar
Published on: 17 Sept 2026 8:36 AM IST
SBN banned India
X

SBN banned India: షహజాద్‌ భట్టీ నెట్‌వర్క్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..!

Shahzad Bhatti Network: భారత అంతర్గత భద్రతను అతలాకుతలం చేయాలని చూస్తున్న శత్రు దేశాల కుట్రలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దేశంలో పలు సంచలన హత్యలకు కుట్ర పన్నడంతో పాటు, సరిహద్దుల అవతల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న షహజాద్‌ భట్టీ నెట్‌వర్క్‌ను కేంద్ర హోంశాఖ ఉగ్రసంస్థగా ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద దీనిని నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భారత్‌ అధికారికంగా నిషేధించిన ఉగ్రసంస్థల జాబితాలో SBN 46వ సంస్థగా చేరింది.

అమాయక యువతను సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఉగ్రసంస్థల్లో చేరేలా ఈ నెట్‌వర్క్ కుట్రపన్నుతోందని కేంద్రం తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. స్థానిక నేరగాళ్లతో చేతులు కలిపి ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్లను నడుపుతూ.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా విద్వేషపూరిత డిజిటల్ కంటెంట్‌ను ప్రచారం చేస్తోంది.

ముఖ్యంగా పోలీస్, రక్షణ రంగాలు, మతపరమైన ప్రదేశాలపై నిఘా పెట్టేందుకు (రెక్కీ), గూఢచర్యం కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు స్థానిక మధ్యవర్తులకు షహజాబ్ భట్టీ భారీగా డబ్బు ముట్టజెబుతున్నట్లు తేలింది. ప్రస్తుతం దిల్లీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్‌ సభ్యులకు వ్యతిరేకంగా అనేక కేసులు నమోదయ్యాయి.

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన 45 ఏళ్ల షహజాద్‌ భట్టీ చిన్నస్థానిని దోపిడీలతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కాలక్రమేణా కిరాయి హంతక ముఠా నేతగా ఎదిగాడు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో కుమ్మక్కై భారత్‌లోకి ఉగ్రమూకల ద్వారా ఆయుధాలు, మత్తుపదార్థాలను చేరవేయడంలో ఆరితేరాడు.

ప్రస్తుతం పాక్ నుంచి యూఏఈకి మకాం మార్చినప్పటికీ, అక్కడి నుంచే తన అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నాడు. మొరాకో దేశ పాస్‌పోర్టుతో అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో తిరుగుతూ ఈ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కోసం భారత భద్రతా సంస్థలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

పంజాబీ గాయకుడు మూసేవాలా హత్యకు భట్టీ ముఠానే ఆయుధాలు సమకూర్చిందనే బలమైన ఆరోపణలున్నాయి. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన కుట్రదారుడైన జీషాన్‌ అక్తర్‌కు భట్టీ అండగా నిలిచాడు. నిందితుడు అజర్‌జైబాన్‌ దేశం విడిచి పరారయ్యేలా సహకరించాడు.

2024 మార్చి 15న జలంధర్‌లో యూట్యూబర్‌ రోజర్‌ సంధు ఇంటిపై గ్రెనేడ్ దాడి, ఈ ఏడాది జనవరి 10న అంబాలా జిల్లా బలదేవ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో బాంబు పేలుడు; అలాగే మే 5న అమృత్‌సర్ కంటోన్మెంట్, జలంధర్‌లోని బీఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన బాంబు పేలుళ్ల వెనుక భట్టీ హస్తం ఉందన్న అనుమానాలతో దర్యాప్తు కొనసాగుతోంది.

సరిహద్దులకు అవతల కూర్చుని దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్న శత్రువుల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. భట్టీ నెట్‌వర్క్‌పై నిషేధంతో దేశంలో ఉగ్రమూకల కదలికలకు మరింత కళ్లెం పడనుంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.