TV Channels: టీవీ ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్..ఏఐ వాడితే అంతే..!
TV Channels: దేశంలోని ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లు ప్రోగ్రామ్ కోడ్ ఖచ్చితంగా పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
TV Channels: టీవీ ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్..ఏఐ వాడితే అంతే..!
Centre govt: దేశంలోని ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్ల ప్రసార తీరుపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉక్కుపాదం మోపింది. వార్తలు, టీవీ షోలు, డిబేట్ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఛానెళ్లకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ల చట్టం, 1995 నిబంధనలను ప్రతీ ఛానెల్ ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పింది. టీవీ షోలలో అనుచిత భాష, అసభ్యకర ప్రవర్తనను సాధారణం చేయడం మానుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.
దేశ భద్రత, శాంతిభద్రతల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను లైవ్‌లో ప్రసారం చేయడం పూర్తిగా నిషేధమని హెచ్చరించింది. లైంగిక వేధింపుల బాధితుల గుర్తింపును ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టకూడదు. అదేవిధంగా దేశ అధికారిక మ్యాప్‌లను మాత్రమే ప్రసారాల్లో వాడాలని ఆదేశించింది. ప్యానెల్ డిబేట్లు, చర్చలు మతతత్వాన్ని లేదా దేశ వ్యతిరేక భావనలను రెచ్చగొట్టేలా ఉండకూడదని స్పష్టం చేసింది.
నేటి డిజిటల్ యుగంలో వార్తల ప్రసారాలు, గ్రాఫిక్స్, వర్చువల్ ప్రజెంటేషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ వాడకం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వార్తల ప్రామాణికత, సున్నితత్వానికి భంగం కలగకుండా చూసుకోవాలి. ఏఐ సాధనాలను కేవలం సహకార మాధ్యమంగానే పరిమితం చేయాలి తప్ప, సాంకేతికత పేరిట ఫేక్ లేదా తప్పుదారి పట్టించే వివరాలను ప్రసారం చేయడం నేరమని హెచ్చరించింది.
ఇంటర్-డిపార్ట్మెంటల్ కమిటీ సిఫార్సుల మేరకు, మీడియా సంస్థలు తమ అంతర్గత సంపాదకీయ సమీక్షా యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది. వార్తల సేకరణ, ఎడిటింగ్, ప్రొడక్షన్ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి చట్టబద్ధమైన నిబంధనలపై క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాలని సూచించింది. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.




