NEET: ‘నీట్‌’ పరీక్షలో భారీ మార్పులు.. ఇకపై ఆన్‌లైన్‌లోనే మెడికల్ ఎంట్రన్స్!

నీట్ (NEET) యూజీ పరీక్షల్లో పెన్ అండ్ పేపర్ విధానానికి స్వస్తి చెప్పి జేఈఈ తరహాలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Arun Chilukuri
Published on: 6 Aug 2026 4:08 PM IST
NEET
X

NEET: ‘నీట్‌’ పరీక్షలో భారీ మార్పులు.. ఇకపై ఆన్‌లైన్‌లోనే మెడికల్ ఎంట్రన్స్!

NEET: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, ఇతర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) యూజీ పరీక్ష విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు కొనసాగుతున్న ‘పెన్ అండ్ పేపర్’ (ఆఫ్‌లైన్) విధానానికి స్వస్తి చెప్పి, జేఈఈ (JEE) తరహాలో కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది.

ఇటీవల నీట్ పరీక్షలో వెలుగుచూసిన పేపర్ లీక్‌లు, వ్యవస్థాగత లోపాలను అరికట్టేందుకు ఈ సమగ్ర మార్పులు చేపడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. నందన్ నిలేకని నేతృత్వంలోని హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చేసే సిఫార్సుల మేరకు ఈ ఆన్‌లైన్ విధానంపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ సుప్రీం కోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు, ఒకవేళ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలోకి మారిస్తే, విద్యార్థుల సౌకర్యార్థం ఆ విషయాన్ని ముందుగానే అధికారికంగా వెల్లడించాలని వైద్యుల సంఘం సుప్రీం కోర్టును కోరింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై తమ స్పందనను తెలియజేయాలని వైద్యుల సంఘంతో పాటు సంబంధిత పిటిషనర్లకు సుప్రీం ధర్మాసనం సూచించింది. ఇక గతంలో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story