Char Dham Yatra : చార్‌ధామ్ యాత్రలో విషాదం.. 91 మంది భక్తులు మృతి

Char Dham Yatra : ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రలో విషాదం.. ఐదు వారాల్లోనే 91 మంది భక్తులు మృతి చెందారు. కేదార్‌నాథ్‌లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. 50 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

CR Reddy
Published on: 26 May 2026 7:06 AM IST
Char Dham Yatra
X

Char Dham Yatra

Char Dham Yatra : ఉత్తరాఖండ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న చార్‌ధామ్ యాత్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు వారాల్లోనే ఏకంగా 91 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరవడంతో ఈ ఏడాది యాత్ర మొదలైంది. ఆ తర్వాత కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను కూడా భక్తుల దర్శనం కోసం తెరిచారు. అయితే, యాత్ర మొదలైన కొద్ది రోజుల్లోనే ఇన్ని మరణాలు సంభవించడం యాత్రికులను భయపెడుతోంది.

కేదార్‌నాథ్‌లోనే అత్యధిక మరణాలు

రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం (SEOC) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కేదార్‌నాథ్‌లో అత్యధికంగా 44 మంది భక్తులు మరణించారు. ఆ తర్వాత బద్రీనాథ్‌లో 24 మంది, యమునోత్రిలో 13 మంది, గంగోత్రిలో 10 మంది మృతి చెందారు. ఈ మరణాలకు ప్రధాన కారణం ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యలేనని అధికారులు ధ్రువీకరించారు. కేదార్‌నాథ్‌లో ఒక వ్యక్తి మాత్రం అనారోగ్యం కాకుండా ఇతర కారణాల వల్ల మరణించినట్లు సమాచారం.

21 లక్షలు దాటిన భక్తుల రద్దీ

మరణాలు భయపెడుతున్నా, భక్తుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం సాయంత్రం నాటికి చార్‌ధామ్ యాత్రకు వచ్చిన వారి సంఖ్య 21 లక్షల మైలురాయిని దాటింది. ఇందులో అత్యధికంగా కేదార్‌నాథ్ స్వామిని 8.42 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, బద్రీనాథ్‌ను 5.84 లక్షల మంది దర్శించుకున్నారు. యమునోత్రి, గంగోత్రి క్షేత్రాలకు కూడా దాదాపు 3.7 లక్షల మంది చొప్పున యాత్రికులు తరలివచ్చారు.

50 ఏళ్లు దాటితే మెడికల్ టెస్ట్ తప్పనిసరి!

భక్తుల ప్రాణాలను కాపాడేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. 50 ఏళ్లు పైబడిన ప్రతి భక్తుడికి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేస్తామని ముఖ్య కార్యదర్శి రాధా రతూరి తెలిపారు. యాత్ర మార్గాల్లో అక్కడక్కడా వైద్య బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే తక్షణమే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

E-Swasthya Dham యాప్ వాడండి

భక్తుల ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హన్స్ ఫౌండేషన్, విష్ ఫౌండేషన్ సహకారంతో E-Swasthya Dham అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. భక్తులు తమ మెడికల్ డేటాను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అత్యవసర సమయంలో భక్తులకు ఏ రకమైన చికిత్స అవసరమో వైద్యులకు సులభంగా అర్థమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిజమైన మెడికల్ హిస్టరీ తెలపాలి

యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో తమ ఆరోగ్య సమస్యల గురించి దాచకుండా నిజాలు చెప్పాలని అధికారులు కోరుతున్నారు. సరైన మెడికల్ హిస్టరీ అందుబాటులో ఉంటే, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు వైద్యులకు వీలవుతుంది. తద్వారా వైద్య వనరులను కూడా మెరుగ్గా నిర్వహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story