Dipesh Sahu: ఆడంబరాలకు పోకుండా.. సామూహిక వివాహ వేదికపై పెళ్లి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే!

Dipesh Sahu: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దీపేశ్‌ సాహు నిరాడంబరతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ప్రభుత్వం నిర్వహించిన ‘ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన’ సామూహిక వివాహాల వేదికపై ఇతర జంటలతో కలిసి ఆయన వివాహం చేసుకున్నారు.

Arun Chilukuri
Published on: 1 Jun 2026 3:07 PM IST
Dipesh Sahu
X

Dipesh Sahu: ఆడంబరాలకు పోకుండా.. సామూహిక వివాహ వేదికపై పెళ్లి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే!

Dipesh Sahu: నేటి కాలంలో సాధారణంగా రాజకీయ నాయకులు లేదా ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో పెళ్లిళ్లు అంటే వందల కోట్ల ఖర్చు, ఆడంబరాలు, విఐపీల హడావుడి కనిపిస్తుంది. కానీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం వీటన్నింటికీ భిన్నంగా, అత్యంత నిరాడంబరంగా సామూహిక వివాహ వేదికపై పెళ్లి చేసుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆదివారం బెమెతారా నియోజకవర్గంలో నిర్వహించిన ‘ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన’ (CM Kanya Vivah Yojana) కార్యక్రమంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే దీపేశ్‌ సాహు (Dipesh Sahu) పెళ్లి పీటలెక్కారు. ఈ సామూహిక వివాహ వేదికపై ఇతర 20 సామాన్య జంటలతో కలిసి ఆయన.. తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు.

ఈ వివాహ వేడుకలో మరో ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. పెళ్లికి ముందు వరుడైన ఎమ్మెల్యే దీపేశ్ సాహును స్థానిక సాంప్రదాయ పద్ధతిలో ఎడ్లబండిపై ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ ఊరేగింపులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అరుణ్ సావో (Arun Sao) స్వయంగా పాల్గొని ఎడ్లబండిని నడపడం అక్కడి వారందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎమ్మెల్యే దీపేశ్ సాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పెళ్లికి వచ్చిన అతిథులు, ప్రజలు ఘనంగా శ్లాఘించారు. ఈ వేడుకకు హాజరైన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ (Vishnu Deo Sai) నూతన వధూవరులను ఆశీర్వదించారు. "ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఆడంబరాలకు పోకుండా, ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన సామూహిక వివాహాల పథకంలో పెళ్లి చేసుకోవడం ఎంతో అభినందనీయం. ఆయన నిరాడంబరత సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడే ప్రతి కుటుంబం ఈ ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజనను సద్వినియోగం చేసుకోవాలి" అని సీఎం పిలుపునిచ్చారు.

ఈ పెళ్లి వేడుకల సందర్భంగానే ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ బెమెతారా జిల్లా అభివృద్ధికి రూ.105 కోట్లకు పైగా విలువైన కొత్త ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి స్థానిక ప్రజలకు డబుల్ బోనాంజా ఇచ్చారు. ప్రస్తుతం ఈ లీడర్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story