Abhijeet Dipke: ఢిల్లీలో హైటెన్షన్.. ‘చలో సంసద్’ ర్యాలీలో సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే అరెస్ట్!

Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 20 July 2026 3:52 PM IST
Abhijeet Dipke
X

Abhijeet Dipke: ఢిల్లీలో హైటెన్షన్.. ‘చలో సంసద్’ ర్యాలీలో సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే అరెస్ట్!

Abhijeet Dipke: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. జంతర్ మంతర్ వద్ద తన నిరాహార దీక్షను విరమించిన అనంతరం, వేలాది మంది యువత మరియు విద్యార్థులతో కలిసి పార్లమెంట్ ముట్టడికి ‘చలో సంసద్’ ర్యాలీగా దూసుకువెళ్తుండగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో పార్లమెంట్ పరిసర ప్రాంతాలన్నీ ఒక్కసారిగా రణరంగంగా మారాయి.

అభిజీత్ దీప్కే పిలుపుతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది నిరసనకారులు ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. పార్లమెంట్ వైపు దూసుకువస్తున్న ఆందోళనకారులను అడ్డుకునేందుకు భద్రతా దళాలు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసి బందోబస్తును మోహరించాయి. అయినప్పటికీ యువత ముందడుగు వేయడంతో పోలీసులు నిరసనకారులపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. ర్యాలీని చెదరగొట్టేందుకు భాష్పవాయువు (Tear Gas) ప్రయోగించారు. ఈ ఉద్రిక్త తోపులాటలో పలువురు యువకులు, విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

ఢిల్లీ వీధుల్లో సీజేపీ ర్యాలీపై జరిగిన లాఠీఛార్జ్ సెగలు పార్లమెంట్‌ను తాకాయి. విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన దాడిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సభలో తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకురావడంతో ఉభయ సభల్లోనూ తీవ్ర గందరగోళం రేగింది. స్పీకర్లు సభను సజావుగా నడిపేందుకు ప్రయత్నించినప్పటికీ వీలుకాకపోవడంతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

ఢిల్లీలో పరిస్థితి చేదాటిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. నిరసనకారుల ప్రధాన డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలో ఇద్దరు కేంద్ర మంత్రులు పార్లమెంట్ లోపల అత్యవసర సమావేశం నిర్వహించారు. మరోవైపు, ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపేందుకు సీజేపీ ప్రతినిధుల బృందం వెళ్ళింది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఢిల్లీ వీధుల్లో భారీగా పారామిలటరీ బలగాలను మోహరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story