Abhijeet Dipke: మా గొంతు నొక్కే కుట్ర.. ఎర్రకోట స్పీచ్‌కు ముందు సిజెపి ఖాతా డిలీట్!

Abhijeet Dipke: స్వాతంత్ర్య దినోత్సవం రోజున కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేత.

Arun Chilukuri
Published on: 15 Aug 2026 3:31 PM IST
Abhijeet Dipke
X

Abhijeet Dipke: మా గొంతు నొక్కే కుట్ర.. ఎర్రకోట స్పీచ్‌కు ముందు సిజెపి ఖాతా డిలీట్!

Abhijeet Dipke: స్వాతంత్ర్య దినోత్సవం వేళ కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా శనివారం ఉదయం కొద్దిసేపు నిలిచిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. తమ గొంతును అణచివేసే కుట్రలో భాగంగానే ఈ చర్యకు పాల్పడ్డారని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఉదయం 6:16 గంటలకు ఖాతా తొలగించబడగా, తిరిగి 6:45 గంటలకు పునరుద్ధరించినట్లు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఢిల్లీ ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడానికి సరిగ్గా కొద్దిసేపటి ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

"తమను అడ్డుకోవాలనుకునేవారు స్వాతంత్ర్య దినోత్సవ క్షణాలను ఎంచుకోవడం సిగ్గుచేటు. ఇలాంటి బెదిరింపు చర్యలకు మేము భయపడేది లేదు" అని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.

దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారడం లేదని దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని తన సొంత గ్రామమైన 'సంతుక్ పింప్రీ' నుంచి ఆయన "స్కూల్‌ ఠీక్‌ కరో" (School Thik Karo) అనే విప్లవాత్మక ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనపై తల్లిదండ్రులు, సర్పంచ్‌లు, గ్రామస్థులు సామాజిక తనిఖీలు నిర్వహించి అధికారులను నిలదీయాలని పిలుపునిచ్చారు.

రాజకీయ నాయకులు భారీ ప్రచార బ్యానర్లపై ఖర్చు చేసే నిధులను గ్రామీణ పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధి కోసం ఉపయోగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని హితవు పలికారు.

గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించినట్లు వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా గ్రామీణ విద్యార్థులు ఇంకా పాఠశాలల్లో కనీస సదుపాయాల కోసం నిరీక్షించే పరిస్థితి ఉండటం అత్యంత విచారకరమని దీప్కే పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story