CJP: రాజస్థాన్‌లో 'సీజేపీ' బృందానికి చేదు అనుభవం.. ఊళ్లోకి రావొద్దంటూ తిప్పిపంపిన గ్రామస్థులు!

CJP: రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా రాంపురా గ్రామంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) బృందంపై స్థానికులు దాడి చేశారు.

Arun Chilukuri
Published on: 21 Aug 2026 2:48 PM IST
CJP
X

CJP: రాజస్థాన్‌లో 'సీజేపీ' బృందానికి చేదు అనుభవం.. ఊళ్లోకి రావొద్దంటూ తిప్పిపంపిన గ్రామస్థులు!

CJP: రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) బృందానికి తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. 'స్కూల్ ఠీక్ కరో' కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన సీజేపీ ప్రతినిధులను తమ ఊరిలోకి రావొద్దంటూ స్థానికులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా నాయకత్వంలో ప్రతినిధుల బృందం శుక్రవారం జైపూర్ జిల్లాలోని 'రాంపురా కన్వర్‌పురా' గ్రామానికి చేరుకుంది. పాఠశాలల్లో సౌకర్యాలను పరిశీలించేందుకు వారు ప్రయత్నించగా, గ్రామస్తులు శివారులోనే వారి వాహనాలను నిలిపివేశారు. "మా పాఠశాలలను మేమే బాగుచేసుకుంటాం, మీ జోక్యం అవసరం లేదు" అని స్పష్టం చేస్తూ వారిని బలవంతంగా వెనక్కి పంపించివేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు తమ బృందంపై రాళ్లతో దాడి చేశారని, వాహనాలను ధ్వంసం చేశారని అశుతోష్ రంకా ఆరోపించారు. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు స్పందించలేదని మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో పంచుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) మద్దతుదారులే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. రాజస్థాన్‌లో గూండాయిజం నడుస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story