మోదీ, అమిత్ షాల కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం.. అశుతోష్ రంకా సంచలన ఆరోపణలు

CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన శాంతియుత నిరసనలను అణచివేసేందుకు కేంద్ర..

G Krishna
Published on: 11 Oct 2026 6:16 PM IST
CJP Protest
X

మోదీ, అమిత్ షాల కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం.. అశుతోష్ రంకా సంచలన ఆరోపణలు

CJP protest: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన శాంతియుత నిరసనలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం బరితెగించిందని, ఈ భయంతోనే ఈ పోరాటాన్ని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేక పోరాటంగా మార్చుకున్నామని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) తీవ్రంగా ధ్వజమెత్తింది. ముందస్తు అరెస్టు పేరుతో అదుపులోకి తీసుకుని, కొన్ని గంటల క్రితమే విడుదలైన సీజేపీ సహ కన్వీనర్ అశుతోష్ రంకా ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గడచిన 72 గంటల్లో దేశం అత్యంత దుర్మార్గమైన అరాచక పాలనను చవిచూసిందని ఆయన మండిపడ్డారు. నిర్దేశిత ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న వేలాది మంది యువతను, విద్యార్థులను దేశవ్యాప్తంగా అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, నిన్న తమను విమానం నుంచి కిడ్నాప్ చేసినంత పని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ తల్లిదండ్రుల ద్వారా విన్న 1975 ఎమర్జెన్సీ చీకటి రోజులను తలపించేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని ఆయన విమర్శించారు.

ఎన్నికల సంఘం కేవలం బీజేపీ విజయానికే పనిచేస్తోంది

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువులను పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్.. పూర్తిగా ప్రధాని మోదీ, అమిత్ షాల కనుసన్నల్లోనే కీలుబొమ్మలా మారాడని అశుతోష్ రంకా తీవ్రంగా ఆరోపించారు. కేవలం బీజేపీని మళ్లీ అధికారంలోకి తేవడమే ఏకైక లక్ష్యంగా ఈ వ్యవస్థ పనిచేస్తోందని విమర్శించారు. ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ ఈ విధంగా అధికార పార్టీకి కొమ్ముకాయడం సిగ్గుచేటని అన్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుటుంబంలో జరిగిన తీవ్ర విషాదం పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానుషంగా, హేయంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అభిజీత్ నాయనమ్మ మరణవార్త తెలిసినా కూడా పోలీసులు కనికరించలేదని, పైగా కెమెరాలు, మైక్రోఫోన్లతో వచ్చి ఆ విషాదాన్ని కూడా ఒక మీడియా ప్రదర్శనగా మార్చడానికి నీచమైన ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తన తల్లిదండ్రులు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, వారికి ఎలాంటి షాక్ తగలకుండా ఉండేందుకు తన కజిన్‌తో మాట్లాడనివ్వాలని అభిజీత్ ఎంతగానో వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: అభిజీత్ దీప్కే స్పష్టీకరణ

తన నాయనమ్మ అంత్యక్రియల నిమిత్తం మహారాష్ట్రలోని సొంత ఊరికి వెళుతున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. పోలీసుల నిర్బంధాలు, ప్రభుత్వ వేధింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని, సీజేపీ తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో అభిజీత్ కుటుంబానికి పార్టీ శ్రేణులన్నీ అండగా ఉంటాయని అశుతోష్ రంకా భరోసా ఇచ్చారు. ఈ పోరాటంలో తమకు ప్రత్యక్షంగా మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష అగ్రనేతలకు సీజేపీ తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాణిక్ సర్కార్, పినరయి విజయన్ వంటి సీనియర్ నాయకులు స్వయంగా వీధుల్లోకి వచ్చి యువతతో కలిసి నిలబడటం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వారు చేస్తున్న పోరాటానికి నిదర్శనమని కొనియాడారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ వంటి వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలను కూడా పోలీసులు అత్యంత క్రూరంగా నిర్బంధించారని దుయ్యబట్టారు. ఈ పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని, దీనిని ఒక ప్రజా యుద్ధంగా మార్చినందుకు కేంద్ర ప్రభుత్వం మున్ముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అశుతోష్ రంకా హెచ్చరించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.