CJP : విద్యార్థులపై కేసులు రద్దు చేయండి.. కేంద్రానికి హెచ్చరిక.!

CJP : నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని

G Krishna
Published on: 27 July 2026 3:06 PM IST
CJP
X

CJP

CJP : నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) డిమాండ్ చేసింది. పలు రాష్ట్రాల్లో విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం , అరెస్టు చేయడంపై పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిర్బంధించిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని, నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కోరింది. మంగళవారంలోగా తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తదుపరి కార్యాచరణకు దిగుతామని కేంద్రానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

ఇచ్చిన మాట తప్పడం తీవ్ర ఆందోళనకరం

సిజెపి నాయకుడు సౌరవ్ దాస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో అస్సాం, పశ్చిమ బెంగాల్ , బీహార్‌లలో విద్యార్థులు, ఇతర నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నట్లు పలు నివేదికలు వచ్చాయని తెలిపారు. "భవిష్యత్తులో భాజపా లేదా ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన లేదా శిక్షాత్మక చర్యలు ఉండవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే మేము దేశవ్యాప్త ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించాం. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా అరెస్టులు చేయడం తీవ్రమైన అంశం" అని పేర్కొన్నారు. నిరసనకారుల కోసం మొదటి రోజు నుంచే తమ లీగల్ టీమ్ పనిచేస్తోందని, బాధితులకు అవసరమైన అన్ని రకాల న్యాయ సహాయం అందిస్తామని ఆ ప్రకటనలో హామీ ఇచ్చారు.

హామీని నిలబెట్టుకోవాలని జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు విజ్ఞప్తి

ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా , కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని సిజెపి కోరింది. "మాకు ఇచ్చిన హామీని ప్రభుత్వం గౌరవించాలి. అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయడంతో పాటు, ఎక్కడా ఎలాంటి కక్షసాధింపు చర్యలు తీసుకోకుండా చూడాలి. నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలి" అని విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాటికి ఈ అంశంపై లిఖితపూర్వక గ్యారెంటీ ఇస్తామన్న హామీని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని డిమాండ్ చేశారు.

విశ్వాసఘాతుకానికి పాల్పడితే ఊరుకునేది లేదు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి 'మంచి ఉద్దేశంతో' మాత్రమే నిరసనలను విరమించామని, ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తే అది కేవలం సిజెపికి మాత్రమే కాకుండా నిరసన కంటే చర్చలకే ప్రాధాన్యత ఇచ్చిన లక్షలాది మంది భారతీయ యువతకు చేసే ద్రోహమే అవుతుందని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి విశ్వసనీయత అనేది హామీలు ఇవ్వడం వల్ల కాదు, ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల వస్తుందని గుర్తుచేశారు. అరెస్ట్ అయిన వారిని మంగళవారంలోగా విడుదల చేయకపోతే తదుపరి చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.

విద్యాశాఖ మంత్రి రాజీనామాతో సమ్మతించిన ప్రభుత్వం

నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సిజెపి తన దేశవ్యాప్త ఆందోళనలను విరమించిన విషయం తెలిసిందే. మంత్రి రాజీనామాతో పాటు, నీట్ పేపర్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిపరివిధాలా గరిష్ట పరిపరిహారం అందించడం, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడం , పరీక్షల సంస్కరణలపై చర్చించడం వంటి తమ ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని పార్టీ తెలిపింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story