CM Siddaramaiah: కర్ణాటక రాజకీయంలో పెను భూకంపం.. సీఎం సిద్ధరామయ్య రాజీనామా..?

CM Siddaramaiah: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు దాదాపు ఖాయమైంది.

Naresh.k
Published on: 27 May 2026 8:56 AM IST
CM Siddaramaiah
X

CM Siddaramaiah: కర్ణాటక రాజకీయంలో పెను భూకంపం.. సీఎం సిద్ధరామయ్య రాజీనామా..?

DK Shivakumar : కర్ణాటక రాజకీయాలు ఒకేసారి శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. గత మూడేళ్లుగా తెరవెనుక నడుస్తున్న కుర్చీలాట ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. కన్నడనాట ముఖ్యమంత్రి మార్పు తథ్యమనే వార్తలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. సుదీర్ఘకాలంగా సాగుతున్న లీడర్‌షిప్ సస్పెన్స్‌కు తెరదించుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల నుండి అత్యంత నమ్మకమైన సమాచారం అందుతోంది. రెండు రోజులుగా ఢిల్లీ వేదికగా సాగిన మారథాన్ చర్చలు, హై-లెవెల్ మీటింగుల తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో సుదీర్ఘంగా సమావేశాలు జరిగాయి. సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలనే వ్యూహంతో, ఆయనకు రాబోయే ఎన్నికల్లో రాజ్యసభ సీటును కాంగ్రెస్ అధిష్టానం ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను సిద్ధరామయ్య సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

2023లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య తీవ్రమైన ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూనే ఉంది. నాడు ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయంలోనే.. సగం టర్మ్ ముగిసిన తర్వాత డీకే శివకుమార్‌కు సీఎం పీఠాన్ని అప్పగిస్తారనే రహస్య ఒప్పందం జరిగిందని డీకే వర్గం బలంగా నమ్ముతోంది. దానికి తోడు ఇటీవల సిద్ధరామయ్య చుట్టూ ముసిరిన కొన్ని వివాదాలు, అవినీతి ఆరోపణలు డీకే శివకుమార్‌కు మరింత కలసివచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా ఈసారి డీకే శివకుమార్ వైపే మొగ్గు చూపినట్లు, సిద్ధరామయ్య గౌరవప్రదంగా తప్పుకునేలా ఆయనను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, కర్ణాటక నెక్స్ట్ సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

అధిష్టానం మాటను గౌరవించి రాజీనామాకు సిద్ధపడినప్పటికీ.. రాజ్యసభ సీటును వద్దనుకున్న సిద్ధరామయ్య భవిష్యత్తు అడుగు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కర్ణాటకలో అణగారిన వర్గాల ఓటు బ్యాంకుపై తిరుగులేని పట్టున్న సిద్ధరామయ్య, ఒకవేళ సీఎం పదవి నుండి తప్పుకుంటే రాష్ట్రంలోనే ఉంటారా? లేక పార్టీలో వేరే పెద్ద బాధ్యతను తీసుకుంటారా? అనేది మే 28న ఆయన ప్రకటించబోయే అధికారిక నిర్ణయంతో తేలనుంది. బెంగళూరు నుండి ఢిల్లీ దాకా దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీలోనే క్యాంప్ వేసి ఉండటంతో.. కన్నడ రాజకీయం ఏ క్షణమైనా అధికారిక మలుపు తిరిగే అవకాశం ఉంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story