CM Vijay : విజయ్‌ను ‘పొలిటికల్ మాంక్’ అన్న మంత్రి.!
CM Vijay : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, తొలి ఎన్నికల సమరంలోనే అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సూపర్‌స్టార్ జొసెఫ్
CM-Vijay
CM Vijay : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, తొలి ఎన్నికల సమరంలోనే అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సూపర్‌స్టార్ జొసెఫ్ విజయ్ 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సినీ రంగాన్ని వీడి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేస్తున్నారు, ఆయన ఆలోచనా విధానం ఎలా ఉందనే దానిపై విజయ్ అత్యంత ఆత్మీయుడు, తమిళనాడు మంత్రి అధవ్ అర్జున ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రోజుకు 20 గంటల పని.. వేకువజామున 4 గంటలకే కాల్స్..
చెన్నైలో జరిగిన 'ఇండియా టుడే తమిళనాడు కాంక్లేవ్' కార్యక్రమంలో అధవ్ అర్జున మాట్లాడుతూ, ముఖ్యమంత్రి విజయ్ శ్రమాకోరని పనిరాక్షసుడని కొనియాడారు. మా నాయకుడు విజయ్ రోజుకు దాదాపు 18 నుంచి 20 గంటల పాటు ప్రజాసేవకే కేటాయిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయాన్నే 4 గంటలకే నిద్రలేచి మంత్రులకు స్వయంగా ఫోన్ చేస్తారని చెప్పారు. ఆయా శాఖల్లో ఏం జరుగుతోంది, పాలనాపరమైన పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందో నేరుగా అడిగి తెలుసుకుంటారని, ప్రజల కోసం నిరంతరం తపించే ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం గర్వకారణమని అర్జున పేర్కొన్నారు.
గెలుపు హంగామా లేదు.. నెక్స్ట్ ఏంటనే ఆలోచనే
ఎన్నికల ఫలితాల్లో సాధించిన ఘనవిజయం ఇచ్చిన గర్వం కానీ, అహంకారం కానీ తమ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించదని అర్జున స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని, అధికార బలాన్ని దుర్వినియోగం చేయకుండా కేవలం ప్రజలకు సేవ చేయడమే తమ ఏకైక లక్ష్యమని చెప్పారు. సీఎం విజయ్ పనితీరును వర్ణిస్తూ, ఆయనను ఒక "రాజకీయ సన్యాసి" (Political Monk) తో పోల్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన మరుసటి రోజు నుంచే సంబరాలకు దూరంగా ఉంటూ నేరుగా సచివాలయానికి వచ్చి పనిలో నిమగ్నమయ్యారని గుర్తుచేశారు. గెలిచాం కదా అని విశ్రాంతి తీసుకోకుండా, తర్వాత ఏం చేయాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఏమిటి, ప్రతి శాఖలో ఉన్న సవాళ్లు ఏమిటనే అంశాలపైనే ఆయన నిరంతరం దృష్టి సారిస్తున్నారని వివరించారు.
అవినీతిపై ఉక్కుపాదం.. వ్యవస్థల్లో మార్పునకు శ్రీకారం
ఈ 100 రోజుల పాలనలో విజయ్ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానా లీకేజీలను అరికట్టడం, ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత తీసుకురావడంపై ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన అధికార వ్యవస్థలో కింది స్థాయిలో ఇంకా అక్కడక్కడా అవినీతి మిగిలి ఉండవచ్చని అంగీకరిస్తూనే, పైస్థాయి నుంచి వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సీఎం తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నిధులు ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టడానికి వీల్లేదని, ప్రతి ప్రభుత్వ ప్రక్రియలోనూ పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలని అధికారులకు విజయ్ అత్యంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అధవ్ అర్జున తెలిపారు.




