CM Vijay: కారు ఆపి కష్టాలు విన్న సీఎం.. రూ.16 కోట్ల వైద్య ఖర్చు భరిస్తామని చిన్నారికి భరోసా
CM Vijay: కోయంబత్తూరులో సీఎం విజయ్ రోడ్షో సందర్భంగా అరుదైన వ్యాధితో పోరాడుతున్న 8 నెలల చిన్నారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
CM Vijay
CM Vijay: తమిళనాడు రాష్ట్రంలో విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో అలాగే ప్రజల చిరకాల స్వప్నమైన సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన అద్భుతమైన పెరియార్ అరివులగం గ్రంథాలయాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి విజయ్ కోయంబత్తూరుకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అయితే ఎయిర్పోర్టు నుంచి కార్యక్రమం జరిగే వేదిక వైపు ఆయన వాహనం వెళ్తున్న సమయంలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న కొందరు తల్లిదండ్రులు తమ 8 నెలల చిన్నారి ప్రాణాలు కాపాడాలని కోరుతూ చేతుల్లో బ్యానర్లు పట్టుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.
పొల్లాచి సమీపంలోని పులియంపట్టి ప్రాంతానికి చెందిన దంపతుల 8 నెలల పాప ఆరుద్ర తీవ్రమైన అలాగే అత్యంత అరుదైన జన్యుపరమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ(SMA) వ్యాధితో బాధపడుతోంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి చిన్నారిని రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యున్నత జోల్జెన్స్మా అనే జీన్ థెరపీ చేయాల్సి ఉంటుంది. భారతీయ కరెన్సీలో దీనికి సుమారు రూ.16 కోట్ల భారీ ఖర్చు అవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆ తల్లిదండ్రులు తమ చిన్నారిని బతికించుకోవడానికి చివరి ప్రయత్నంగా ముఖ్యమంత్రిని నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు.
జనసమూహానికి అభివాదం చేస్తూ ఓపెన్ టాప్ వెహికల్లో వెళ్తున్న ముఖ్యమంత్రి విజయ్ కంట పడగానే ఆ బ్యానర్లు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన తన వాహనాన్ని కొద్దిగా వేగం తగ్గించాల్సిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఆ బ్యానర్లు పట్టుకున్న వారిని తన దగ్గరకు తీసుకురావాలని కోరారు. చిన్నారి తల్లి ప్రియాంకను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి, లక్షలాది రూపాయల వైద్య ఖర్చు గురించి వారు కన్నీళ్లతో వివరించగా చలించిపోయిన సీఎం విజయ్.. "ఎలాంటి ఆందోళన చెందవద్దు, చిన్నారి వైద్య ఖర్చులు అన్నీ నేనే చూసుకుంటాను, ప్రాణాలు కాపాడుకోవడానికి కావాల్సిన పూర్తి సహాయం అందిస్తాను" అని భరోసానిచ్చారు.
సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ప్రశంసలు
ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, రాజకీయ పర్యటనల్లో క్షణం తీరిక లేకపోయినప్పటికీ, రోడ్డుపై ప్రజల కష్టాలను గుర్తించి క్షణాల వ్యవధిలో స్పందించి ముఖ్యమంత్రి ఇచ్చిన హాైమీ పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సీఎం విజయ్ మానవతా దృక్పథాన్ని కొనియాడుతున్నారు. కష్టకాలంలో ఉన్న ఒక చిన్నారి కుటుంబానికి ఆయన అందించిన ఈ భరోసా నిజంగా ఎంతో గొప్ప విషయమని, ఇది ఆ కుటుంబానికి పునర్జన్మ అని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




