CM Vijay: జ్యోతిష్కుడి నియామకంపై వెనక్కి తగ్గిన సీఎం విజయ్
మిత్రపక్షాలు, ప్రతిపక్షాల విమర్శలతో సీఎం విజయ్ తన జ్యోతిష్కుడు వెట్రివేల్‌కు ఇచ్చిన OSD నియామకాన్ని రద్దు చేశారు.
CM Vijay Cancels Astrologer OSD Post After Criticism
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన జ్యోతిష్కుడి నియామకంపై సీఎం విజయ్ వెనక్కి తగ్గారు. తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా నియమించిన నిర్ణయాన్ని సీఎం విజయ్ రద్దు చేశారు.
ఈ నిర్ణయం మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు ఈ నియామకాన్ని బహిరంగంగా తప్పుబట్టాయి.
వీసీకే ఎమ్మెల్యే వాణి అర్సు మాట్లాడుతూ.. ప్రభుత్వం శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాలని, జ్యోతిష్యాలాంటి మూఢనమ్మకాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు. సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజల డబ్బుతో జ్యోతిష్కుడికి ప్రభుత్వ హోదా ఇవ్వడం సరైన విధానం కాదని విమర్శించారు.
డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్ కూడా ఈ అంశంపై స్పందించారు. “యువత మీపై నమ్మకం పెట్టుకుని ఓటు వేసింది. జ్యోతిష్కుడిని ప్రభుత్వ హోదాలో పెట్టడం ద్వారా యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?” అంటూ సీఎం విజయ్ను ప్రశ్నించారు.
ఈ వివాదం మరింత ముదరడంతో అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ అనంతరం సీఎం విజయ్ స్పందించారు. రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఈ నియామకాన్ని మళ్లీ పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం వెట్రివేల్ నియామకాన్ని అధికారికంగా రద్దు చేశారు.




