Vijay: స్టాలిన్ వ్యాఖ్యలపై సీఎం విజయ్ తీవ్ర ఆగ్రహం.. మహిళలను అవమానిస్తే సహించేది లేదు!

Vijay: టీవీకే అభ్యర్థి సత్యభామపై ఎంకే స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం విజయ్ తీవ్రంగా మండిపడ్డారు. డీఎంకే తీరును ఖండిస్తూ విజయ్ చేసిన వ్యాఖ్యల పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 3 Oct 2026 2:33 PM IST
Vijay
X

Vijay: స్టాలిన్ వ్యాఖ్యలపై సీఎం విజయ్ తీవ్ర ఆగ్రహం.. మహిళలను అవమానిస్తే సహించేది లేదు!

Vijay: తమిళనాడులో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా వేడెక్కించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధారాపురం టీవీకే (TVK) అభ్యర్థి సత్యభామను ఉద్దేశించి డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌‌ తీవ్రంగా స్పందించారు. ధారాపురంలో డీఎంకే ఒక అనాగరిక సభను నిర్వహించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ధారాపురం నుంచి అన్నాడీఎంకే (AIADMK) అభ్యర్థిగా గెలిచిన సత్యభామ.. ఆ వెంటనే విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఫిరాయింపును ఉద్దేశించి ప్రచారంలో మాట్లాడిన ఎంకే స్టాలిన్‌.. సత్యభామను ‘సూట్‌కేస్ భామ’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

స్టాలిన్ వ్యాఖ్యలపై సీఎం విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ధారాపురంలో డీఎంకే ఒక అనాగరిక సభను నిర్వహించింది. మా పార్టీ అభ్యర్థి సత్యభామను ఉద్దేశించి ఎంకే స్టాలిన్ అసభ్యంగా మాట్లాడి వికృతానందం పొందారు’’ అని విజయ్ ధ్వజమెత్తారు.

డీఎంకే సభ్యులు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారని, మహిళలను గౌరవించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మహిళలు పక్కనే కూర్చుని ఉన్నప్పటికీ, వారి ఇబ్బందిని ఏమాత్రం పట్టించుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు.

రాష్ట్ర మహిళలకు ఒక సోదరుడిగా, కుమారుడిగా ఈ అగౌరవాన్ని ఇక చూస్తూ ఉండలేనని పేర్కొన్న విజయ్.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఆ నేతలకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనూ స్పష్టం చేసిన విజయ్, తాజాగా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.