రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పేపర్ లీక్‌ల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ (CJP) తెగేసి చెప్పింది.
రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) స్పష్టం చేసింది. ప్రభుత్వంతో మూడో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో సీజేపీ ప్రతినిధి అశుతోశ్ రంకా మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ వైఖరిని ఖరాకండీగా వెల్లడించారు. మంత్రి రాజీనామాకు ప్రభుత్వం సిద్ధపడని పక్షంలో ఇకపై కేంద్రంతో చర్చలు జరపడంలో ఎలాంటి అర్థం లేదని తేల్చిచెప్పారు.
ప్రధాన డిమాండ్‌పై స్పష్టత ఏది?
గత చర్చలలో నష్టపరిహారం, నమోదు చేసిన చట్టపరమైన కేసుల తొలగింపు వంటి విషయాలపై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించిందని, ఈ రోజు దానిపై లిఖితపూర్వక హామీ వస్తుందని ఆశిస్తున్నామని రంకా తెలిపారు. అయితే, ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి సానుకూల స్పందన లేదన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని తెలిస్తే తమ తదుపరి కార్యాచరణ, వ్యూహంతో ముందుకు వెళ్తామని హెచ్చరించారు.
అధికారుల తొలగింపు మాత్రమే సరిపోదు!
పేపర్ లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి బదిలీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి చెందిన 47 మంది అధికారుల తొలగింపుపై సీజేపీ స్పందించింది.
"తొలగించిన 47 మంది అధికారులు ఎవరో, వారిని ఏ ఉద్దేశంతో తొలగించారో పరిశీలించాల్సి ఉంది. కేవలం అధికారులపై చర్యలు మాత్రమే సరిపోవు. దేశంలో జరిగిన పేపర్ లీక్‌లకు, నీట్ పరీక్ష తదనంతర పరిణామాల్లో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కచ్చితంగా రాజీనామా చేయాలి" అని అశుతోశ్ రంకా డిమాండ్ చేశారు.
కఠిన చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం
మరోవైపు పోటీ పరీక్షలలో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన 'ప్రజా పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టం-2024'కు కేంద్ర కేబినెట్ సవరణలు ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
శిక్షలు పెంపు: సంఘటిత పేపర్ లీక్‌లకు పాల్పడితే గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష.
భారీ జరిమానా: లీకేజీ ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు.
గతంలో ఉన్న 3 నుంచి 5 ఏళ్ల శిక్ష కాలాన్ని మరింత కఠినతరం చేస్తూ కేంద్రం తీసుకువచ్చిన ఈ చట్ట సవరణలను స్వాగతిస్తున్నప్పటికీ, మంత్రి రాజీనామా డిమాండ్‌కు మాత్రం కట్టుబడి ఉన్నామని సీజేపీ స్పష్టం చేసింది.




