CJP: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలి.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన డిమాండ్!

CJP: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాల వార్తల నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 24 Sept 2026 3:45 PM IST
CJP
X

CJP: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలి.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన డిమాండ్!

CJP: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రానున్న 48 గంటల్లోగా తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) డిమాండ్ చేసింది. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తీవ్రంగా హెచ్చరించింది. అంతేకాకుండా, రాబోయే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని సీజేపీ డిమాండ్ చేసింది.

న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. సీఈసీ రాజీనామా చేయకపోతే ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో సీజేపీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ పార్టీ తరఫున మూడు ప్రధాన డిమాండ్లను వెల్లడించారు.

1. సీఈసీ రాజీనామా మరియు క్రిమినల్ చర్యలు: జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపిస్తున్న వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

2. ఎన్నికల నిలిపివేత: రాబోయే అన్ని ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయాలి.

3. ఓటర్ల జాబితా సవరణ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను 2025 నాటి ఓటర్ల జాబితా స్థితికి వెనక్కి తీసుకెళ్లాలి. ఎస్ఐఆర్‌కు సంబంధించిన ఫైళ్లను సుప్రీంకోర్టు నేతృత్వంలోని కమిటీ ఆధీనంలో ఉంచాలని, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్రస్తుత చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సందర్భాల్లో ఎన్నికల ప్రక్రియ నిర్ణయాలపై అభ్యంతరాలు తెలిపారంటూ 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఇటీవల ఓ నివేదిక వెలువరించింది. అయితే ఈ నివేదికను ఎన్నికల సంఘం పూర్తిగా కొట్టిపారేసింది. ఎస్ఐఆర్ సహా అన్ని నిర్ణయాలను పూర్తి కమిషన్ ఆమోదంతోనే ఏకగ్రీవంగా తీసుకున్నామని స్పష్టం చేసింది. చర్చల సమయంలో కమిషనర్లు అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడం సాధారణ అంతర్గత ప్రక్రియలో భాగమేనని ఈసీ తేల్చిచెప్పింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.