కాక్రోచ్ జనతా పార్టీ నేతకు చిక్కులు.. సౌరవ్ దాస్‌పై లుకౌట్ సర్క్యులర్!

Sourav Das: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్ దాస్‌పై లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది.

G Krishna
Published on: 26 Nov 2026 1:43 PM IST
Sourav Das
X

కాక్రోచ్ జనతా పార్టీ నేతకు చిక్కులు.. సౌరవ్ దాస్‌పై లుకౌట్ సర్క్యులర్!

Sourav Das: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్ దాస్‌పై లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఆయన పాస్‌పోర్ట్ వివరాలలో తేడాలు ఉన్నాయనే కారణంతో ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది. యూకే వెళ్లకుండా తనను అడ్డుకున్న అనంతరం ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

పాస్‌పోర్ట్ రికార్డుల్లో లోపాలు.. పౌరసత్వంపై ప్రశ్నలు

కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చేతన్ శర్మ, జస్టిస్ అమిత్ మహాజన్ ముందు పలు కీలక విషయాలు వెల్లడించారు. సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్ రికార్డులలో చదువు, చిరునామా, తల్లిదండ్రుల వివరాలకు సంబంధించి తేడాలు ఉన్నాయని, ఇవి ఆయన భారత పౌరసత్వంపై కూడా ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందని తెలిపారు.

పాస్‌పోర్ట్ దరఖాస్తులో తండ్రి పేరును ఖాళీగా ఉంచారని, కొన్ని పత్రాలలో చిరునామా ఢిల్లీగా, మరికొన్నింటిలో పుదుచ్చేరిగా కనిపిస్తోందని పేర్కొన్నారు. పుదుచ్చేరి ఎస్పీ ఆగస్టు 20న నిర్వహించిన విచారణలో ఈ లోపాలు బయటపడ్డాయని, ముంబై పోలీసుల అభ్యర్థన మేరకు ఎల్ఓసీ జారీ చేశారని వివరించారు.

ఎల్ఓసీ సమాచారం ఇవ్వలేదంటూ పిటిషనర్ తరఫు వాదనలు

విచారణ సమయంలో ఎల్ఓసీ ఉనికి ప్రధాన అంశంగా మారింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లేదా ప్రయాణంపై ఆంక్షలు విధిస్తూ ఎటువంటి ఉత్తర్వులు చూపించకుండా దేశం విడిచి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారని సౌరవ్ దాస్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశ్నించారు.

ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాతే తన క్లయింట్‌కు షోకాజ్ నోటీసు అందిందని, పౌరులను ఇలా ఎలా చూస్తారని వాదించారు. ఏ నేరానికి, ఎప్పుడు ఎల్ఓసీ జారీ చేశారో స్పష్టం చేయాలని, చట్టపరమైన పరిష్కారాల కోసం సర్క్యులర్ కాపీ ఇవ్వాలని కోరారు.

సర్క్యులర్ కాపీ ఇవ్వలేం.. డిసెంబర్ 9కి తదుపరి విచారణ

అయితే ఎల్ఓసీ కాపీని అందించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్క్యులర్ గురించి దాస్‌కు ఇప్పుడు తెలిసిపోయిందని, వేరే చట్టపరమైన ప్రక్రియల ద్వారా సవాలు చేసుకునే స్వేచ్ఛ ఉందని చేతన్ శర్మ వాదించారు. నవంబర్ 23 రాత్రి 7.32 గంటలకు షోకాజ్ నోటీసు, నాలుగు నిమిషాల తర్వాత 7.36 గంటలకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశామని, వివరణ ఇచ్చేందుకు నవంబర్ 30 వరకు గడువు ఇచ్చామని కోర్టుకు తెలిపారు.

పాస్‌పోర్ట్‌ను రద్దు చేయలేదని, నోటీసుకు సమాధానం ఇవ్వకుండా హైకోర్టును ఆశ్రయించారని, పిటిషన్ దాఖలు చేయడం సరైనదేనా అన్న అంశాన్ని కూడా లేవనెత్తారు. మరోవైపు జన్మస్థల వివరాలపై చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం షోకాజ్ నోటీసు ఇచ్చిందని విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించగా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు వెళ్తుండగా నవంబర్ 24న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తనను అడ్డుకున్నారని దాస్ పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై కేంద్రం, హోం మంత్రిత్వ శాఖ, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ, డిసెంబర్ 9లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించి తదుపరి విచారణను వాయిదా వేసింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.