Cockroach Janta Party : కాక్రోచ్ జనతా పార్టీ.. 6 రోజుల్లోనే 2 కోట్ల మంది ఫాలోవర్స్.. అసలేంటి ఈ వింత ట్రెండ్ ?
Cockroach Janta Party : దేశంలో నిరుద్యోగ యువత అండతో 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే డిజిటల్ మీమ్ ఉద్యమం సంచలనం సృష్టిస్తోంది. పుట్టిన ఆరు రోజుల్లోనే ఈ పేజీ 2 కోట్ల ఫాలోవర్లను దాటిపోయింది.
Cockroach Janta Party
Cockroach Janta Party : భారతదేశ రాజకీయాల్లోకి సోషల్ మీడియా వేదికగా ఒక వింత ట్రెండ్ మొదలైంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. సాధారణంగా ఇళ్లల్లో మురికిగా ఉండే చోట తిరిగే బొద్దింకలను చూస్తేనే మనం హిట్ స్ప్రే కొట్టో లేదా కాళ్లతో తొక్కి చంపేస్తాం. కానీ ఇప్పుడు అదే బొద్దింక పేరుతో ఇంటర్నెట్‌లో ఒక సరికొత్త డిజిటల్ విప్లవం నడుస్తోంది. ఈ పార్టీని స్థాపించిన కేవలం 6 రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్లకు (2 కోట్ల 10 లక్షల కంటే ఎక్కువ) పైగా ఫాలోవర్లు చేరిపోయారు. ఈ సంఖ్య నిమిష నిమిషానికి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. అసలు ఎవరూ ఇష్టపడని ఒక కీటకం పేరుతో పెట్టిన ఈ పార్టీకి యువత ఇంతలా ఎందుకు బ్రహ్మరథం పడుతుందో ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సరికొత్త ఆన్‌లైన్ ఫ్రంట్ ట్యాగ్‌లైన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది.. ఇది పక్కా యూత్ టార్గెట్‌గా నడుస్తోందని. 'యువత కోసం, యువత ద్వారా, యువత చేత నడపబడే ఒక పొలిటికల్ ఫ్రంట్' అని దీని బయోలో రాసుకొచ్చారు. మే 16న ఈ సరికొత్త ఆన్‌లైన్ పేజీని ప్రారంభించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక బోస్టన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న అభిజీత్ దీప్కే అనే విద్యార్థి ఈ వినూత్న డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ పార్టీ ముఖ్య గుర్తు బొద్దింక కాగా.. వారి ప్రధాన స్లోగన్ 'సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ'. అంటే వారు తమను తాము లౌకిక, సమాజవాద, ప్రజాస్వామ్య బద్ధమైన సోమరిపోతులుగా అభివర్ణించుకుంటున్నారు.
ఈ వింత పార్టీ పుట్టడానికి వెనుక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్యే ప్రధాన కారణం. మే 15న కోర్టు విచారణలో భాగంగా సీజేఐ ఒక వ్యాఖ్య చేశారు. దేశంలో ఉద్యోగాలు దొరకని నిరుద్యోగ యువతంతా బొద్దింకల వలే మీడియా, సోషల్ మీడియా, యాక్టివిజంలోకి దూరిపోతున్నారని, అక్కడ ఉంటూ ప్రతి ఒక్కరిపై ట్రోలింగ్ చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆ తర్వాత సీజేఐ స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా చిత్రీకరించారని క్లారిటీ ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీజేఐ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మరుసటి రోజే మే 16న కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది.
పార్టీలో చేరాలంటే ఈ 4 అర్హతలు ఉండాలి
ఈ ఆన్‌లైన్ డిజిటల్ మూవ్‌మెంట్‌లో సభ్యులుగా చేరడానికి వారు పెట్టిన కండిషన్లు చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది. ఈ పార్టీలో చేరాలంటే కింద పేర్కొన్న నాలుగు ప్రధాన అర్హతలు తప్పనిసరిగా ఉండాలని వ్యవస్థాపకులు ప్రకటించారు:
* పక్కా నిరుద్యోగి
* పరమ సోమరిపోతు
* 24 గంటలు ఆన్‌లైన్‌లోనే గడపాలి
* ప్రొఫెషనల్ పద్ధతిలో తమ మనసులోని భారాన్ని/కోపాన్ని వెళ్లగక్కే సత్తా ఉండాలి.
ప్రస్తుతం ట్విట్టర్ (X)లో ఈ పార్టీ హ్యాండిల్ పేరు కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అని మార్చారు. ఎందుకంటే వీరి పాత అకౌంట్‌ను కొందరు రిపోర్ట్ చేయడంతో అది బ్లాక్ అయింది. దీని బయోలో బొద్దింకలు ఎప్పటికీ చావవు అని రాసి పెట్టారు.
ఈ మాస్టర్ మైండ్ వెనుక ఎవరున్నారు?
ఈ డిజిటల్ సంచలనానికి తెరలేపిన అభిజీత్ దీప్కే సామాన్యుడు కాదు. ప్రస్తుతం ఈయన బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే ఇతనికి గతంలో రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. 2020 నుంచి 2022 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన AAP అధికారిక సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్‌గా అభిజీత్ పనిచేశాడు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చేసి పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. పొలిటికల్ మైండ్ గేమ్‌లు బాగా తెలిసిన వ్యక్తి కావడంతోనే.. చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యను దేశంలోని నిరుద్యోగ సమస్యకు ముడిపెట్టి, ఇలాంటి ఒక అద్భుతమైన డిజిటల్ సెటైర్ ఉద్యమాన్ని సృష్టించగలిగాడని నిపుణులు చెబుతున్నారు.
గూగుల్ ట్రెండ్స్‌లో బొద్దింక టాప్
ప్రస్తుతానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ భారత ఎన్నికల సంఘం వద్ద నమోదైన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదు. ఇది కేవలం ఒక డిజిటల్ మీమ్ లాగా ప్రారంభమై, దేశంలోని కోట్ల మంది నిరుద్యోగ యువత మనోభావాలను ప్రతిబింబించేలా వైరల్ అయింది. అయితే భవిష్యత్తులో ఈ పార్టీని నిజంగానే రిజిస్టర్ చేసి, ఎన్నికల గుర్తు కోసం దరఖాస్తు చేస్తారా లేదా అనేది ఎవరికీ తెలియదు. కానీ ఈ పేజీకి వస్తున్న రెస్పాన్స్ చూసి అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో యువత ఒకే తాటిపైకి రావడం రాజకీయంగా చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వింత పార్టీ క్రేజ్ వల్ల ప్రస్తుతం గూగుల్ ట్రెండ్స్‌లో కూడా కాక్రోచ్ అనే పదం టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.




