CJP: అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు.. అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద మోర్చా ఖాయం!

CJP: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సిఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన మోర్చా.

G Krishna
Published on: 5 Oct 2026 11:07 AM IST
CJP
X

CJP: అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు.. అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద మోర్చా ఖాయం!

CJP: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సిఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన మోర్చా చేపడతామని ప్రకటించిన కాకరోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆందోళన కార్యక్రమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తమను ముందస్తుగా అరెస్టు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఆదివారం అర్ధరాత్రి ఆరోపించారు.

పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, కీలక నేతలు అశుతోష్ రాంకా, రత్నలతో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఇటువంటి నిరంకుశ చర్యలతో యువత గళాన్ని నొక్కలేరని, నేతలను జైలుకు పంపినా దేశవ్యాప్తంగా ప్రజలు తమ భవిష్యత్తు కోసం పోరాటాన్ని కొనసాగిస్తారని, అక్టోబర్ 10న ప్రారంభమయ్యే ఈ నిరసనను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు.

కేంద్ర హోంమంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు

ఈ అరెస్టుల కథనాలపై సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే స్పందిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "అమిత్ షా గారూ.. మీరు ఎంతమందిని అరెస్టు చేస్తారు? అక్టోబర్ 10న దేశం మొత్తం ఢిల్లీ వైపు వస్తోంది" అంటూ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్వీట్ చేశారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల ముంబైలోని శివాజీ పార్క్ వద్ద కూడా శివసేన (యుబిటి) మద్దతుతో సీజేపీ నేతలు 'జైల్ భరో' నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.

సంచలనంగా మారిన గత పోరాటాలు

గతంలో కూడా ఈ సీజేపీ నాయకులు పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అస్సాంలో జరిగిన మొదటి రీజినల్ వాలంటీర్ల సమావేశానికి ముందు అశుతోష్ రాంకాతో సహా పలువురు నేతలను స్థానిక పోలీసులు 12 గంటల పాటు నిర్బంధించారు. అంతేకాకుండా, నీట్ (NEET) పేపర్ లీకేజీకి నిరసనగా జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన 36 రోజుల సుదీర్ఘ ఆందోళన తీవ్ర సంచలనం సృష్టించింది.

ఆ నిరసనల ఫలితంగానే అప్పట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని పార్టీ ప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద బృహత్ నిరసనకు పిలుపునివ్వడంతో, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న తీవ్ర ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.