Cockroach Janata Party: మంత్రి రాజీనామా చేసేవరకు పోరాటం ఆగదు.. CJP చీఫ్ డిమాండ్..
Cockroach Janata Party: 'కాక్రోచ్ జనతా పార్టీ' పేరుతో జెన్-జెడ్ యువత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న భారీ నిరసన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Cockroach Janata Party: మంత్రి రాజీనామా చేసేవరకు పోరాటం ఆగదు.. CJP చీఫ్ డిమాండ్..
Cockroach Janata Party: రాజకీయాల్లో నిరసనలు, ధర్నాలు సర్వసాధారణం. కానీ ఆ నిరసనలు తెలిపే విధానం, లేదా ఆ పార్టీల పేర్లు విచిత్రంగా ఉంటే మాత్రం అది వెంటనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' చేపట్టిన నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. దీంతో ఈ నిరసనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. CJP ఫౌండర్ అభిజీత్ దిప్కేతో పాటు ఇతర నాయకులు, అలాగే వేలాది మంది విద్యార్ధులు జంతర్ మంతర్ వద్దకు చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ నేపధ్యంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఆయన రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని CJP చీఫ్ అభిజీత్ అన్నారు.
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ?
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఇటీవల కొందరు లాయర్లను ఉద్దేశించి "బొద్దింకలు" అని చేసిన వ్యాఖ్యల నుంచి ఈ పార్టీకి బీజం పడింది. మొదట సోషల్ మీడియాలో ఒక సెటైరికల్ ఉద్యమంగా మొదలైన ఈ CJP, ప్రస్తుతం వేలాది మంది యువత మద్దతుతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అభిజీత్ దిప్కే అనే 30 ఏళ్ల యువకుడు ఈ ఉద్యమానికి వ్యవస్థాపకుడు.
వీరి ప్రధాన డిమాండ్ ఏంటి?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG, CUET, CBSE తదితర కీలక పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నదే వీరి ప్రధాన డిమాండ్. పరీక్షల కుంభకోణాల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆరోపిస్తూ, జూన్ 6న(శనివారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అభిజీత్ దిప్కే నేతృత్వంలో ఈ నిరసన చేపట్టారు. అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్న అభిజీత్ దిప్కే, ఈ నిరసనలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా భారత్‌కు వచ్చారు.
శాంతియుత నిరసన - ప్రముఖుల మద్దతు:
ఈ ఆందోళన పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా జరుగుతుందని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాకుండా, ఈ ఉద్యమానికి ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ కూడా తన పూర్తి మద్దతు ఇప్పటికే ప్రకటించారు.




