Cockroach Janta Party: అరవింద్ కేజ్రీవాల్‌తో సీక్రెట్ డీల్?.. రెండుగా చీలిన కాక్రోచ్ పార్టీ

Cockroach Janta Party: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీలో తీవ్ర తిరుగుబాటు వ్యక్తమైంది. నీట్ పేపర్ లీక్ ఆందోళనతో వెలుగులోకి వచ్చిన ఈ పార్టీ రెండుగా చీలిపోయింది.

CR Reddy
Published on: 4 Sept 2026 8:05 AM IST
Cockroach Janta Party
X

Cockroach Janta Party

Cockroach Janta Party: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ ముసుగులో రాజకీయం చేస్తున్నారంటూ సీనియర్ నాయకుడు మనీష్ బ్రహ్మభట్ ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి రాజీనామా చేశారు. అక్కడితో ఆగకుండా 'కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్' (సిజెపి-డి) పేరుతో సరికొత్త రంగాన్ని సిద్ధం చేశారు. ఆందోళన విజయం సాధించిన వెంటనే క్షేత్రస్థాయిలో కష్టపడిన విద్యార్థులను, వాలంటీర్లను పక్కనబెట్టి వ్యాపారం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేజ్రీవాల్ ప్రయోజనాల కోసమే సరికొత్త కమిటీ

పార్టీ నిర్మాణంలో జరిగిన అన్యాయాన్ని మనీష్ బ్రహ్మభట్ వివరించారు. ఆందోళన ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల జాతీయ కమిటీలో 8 మంది ఆమ్ ఆద్మీ పార్టీతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవారే ఉన్నారని ఆరోపించారు. ఈ కమిటీ రూపకల్పన మొత్తం అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగిందని స్పష్టం చేశారు. నీట్ పోరాటంలో శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పలు పార్టీలకు చెందిన యువకులు పాల్గొన్నప్పటికీ, కొత్త కమిటీలో ఎవరికీ చోటు ఇవ్వకపోవడం ఘోరమైన ద్రోహమని మండిపడ్డారు. మహిళలు, మైనారిటీలకు కనీస ప్రాతినిధ్యం కల్పించకుండా మెరిట్‌ను తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సిజెపి-డి పేరుతో నిజమైన ప్రజాస్వామ్య వేదిక

అభిజీత్ దీపకే నియంతృత్వ ధోరణికి స్వస్తి పలుకుతూ తాము ఏర్పాటు చేసిన సిజెపి-డి నిజమైన ప్రజాస్వామ్య సూత్రాలపై పనిచేస్తుందని బ్రహ్మభట్ వెల్లడించారు. ప్రతి రాష్ట్రం నుంచి ఉద్యమంలో పాల్గొన్న ఐదుగురు స్థానిక ప్రతినిధులకు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల హక్కుల కోసం ఏర్పాటైన వేదికను ఏ ఒక్క రాజకీయ నాయకుడి స్వార్థానికి వాడుకోనివ్వమని స్పష్టం చేశారు.

మేము ఎవరికి బి-టీమ్ కాదు: అభిజీత్ దీపకే

తనపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలపై పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీపకే వెంటనే స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీతో తమకు ఎలాంటి ఒప్పందాలు లేవని, ఇవన్నీ కుట్రపూరిత ప్రచారాలని కొట్టిపారేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తమను కాంగ్రెస్ బి-టీమ్ అని, మరికొందరు ఆప్ బి-టీమ్ అని ముద్ర వేస్తున్నారని విమర్శించారు. రాజకీయ నాయకులందరూ ఒకచోట కూర్చుని తాము ఎవరికి బి-టీమో ముందుగా తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. తాము కేవలం విద్యార్థుల ఏ-టీమ్ అని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని తేల్చి చెప్పారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story