ప్రేమ నిరాకరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి..!

Love Breakup: కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూర్‌లో ఘోరం జరిగింది. ప్రేమను నిరాకరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాడు ఓ కేటుగాడు.

Arun Chilukuri
Published on: 26 May 2026 10:30 AM IST
coimbatore
X

ప్రేమ నిరాకరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి..!

Love Breakup: ప్రేమించిన యువతి తనను దూరం పెట్టిందనే కక్షతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమె ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడిన కలకలరేపే సంఘటన కోయంబత్తూరు జిల్లాలో వెలుగుచూసింది.

కోయంబత్తూర్‌ జిల్లా తొండాముత్తూర్‌ సమీపంలోని కళిక్కనాయక్కన్‌పాళైయానికి చెందిన ఓ యువతి, కాలేజీలో చదువుకునే రోజుల్లో చెన్నైకి చెందిన కార్తిక్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే, ఇటీవల కార్తిక్ నేరచరిత్ర గురించి యువతికి దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి. రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్‌లలో కార్తిక్‌పై 31కి పైగా క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆమెకు తెలిసింది. ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌తో బంధం ప్రమాదకరమని గ్రహించిన సదరు యువతి, అతనితో ఉన్న ప్రేమ సంబంధాన్ని పూర్తిగా తెంచుకుని దూరం పెట్టింది.

తాను ప్రాణంగా ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పడాన్ని కార్తిక్ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఆమెపై పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం కార్తిక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి కళిక్కనాయక్కన్‌పాళైయంలోని యువతి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న యువతి తండ్రిని తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, తాము వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ బాంబులను ఒక్కసారిగా ఆ ఇళ్లపైకి విసిరారు.

బాంబులు పేలడంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర కలకలం రేగింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

బాధిత కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొండాముత్తూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కార్తిక్‌తో పాటు అతని ముగ్గురు స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story