నెల మొదట్లోనే షాక్.. కమర్షల్ గ్యాస్, విమాన ఇంధనం ధరలు పెంపు
నవంబర్ 1వ తేదీన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు , విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను సవరిస్తూ వినియోగదారులకు చేదు వార్త
Commercial LPG and ATF Price Hike
నవంబర్ 1వ తేదీన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు , విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను సవరిస్తూ వినియోగదారులకు చేదు వార్త మోసుకొచ్చాయి. నూతన ధరల ప్రకారం 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 10 పెరిగి రూ. 2,820కి చేరగా, విమానాల్లో వాడే ఏటీఎఫ్ ధరను కూడా లీటరుకు రూ. 1.37 చొప్పున పెంచారు. అక్టోబర్ 1న ఇప్పటికే రూ. 62.50, సెప్టెంబర్‌లో రూ. 9.50 పెరిగిన నేపథ్యంలో, వాణిజ్య సిలిండర్‌పై ఇది వరుసగా మూడో నెల పెంపు కావడం గమనార్హం. అంతకుముందు జూలై, ఆగస్టు నెలల్లో దాదాపు రూ. 375 వరకు తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న వ్యాపారులకు, ఈ వరుస పెంపులు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఫిబ్రవరి నుండి జూన్ మధ్య కాలంలో రికార్డు స్థాయిలో రూ. 3,113.50కి చేరిన ధరలతో పోలిస్తే ఇది కొంత తక్కువే అయినప్పటికీ, పండుగల సీజన్‌లో ఈ తాజా పెరుగుదల హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులపై అదనపు భారంగా మారనుంది.
సవరించిన పట్టిక ప్రకారం 5 కేజీల ఎఫ్‌టీఎల్ (FTL) కొత్త కనెక్షన్ ధర రూ. 1,903 వద్ద , రీఫిల్ ఛార్జీ రూ. 782 వద్ద నిర్ణయించారు. అయితే సాధారణ ఇళ్లలో వాడే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ. 942 వద్దే ఉంచడంతో పాటు, మే నెలలో రూ. 7.50 పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను కూడా స్థిరంగా ఉంచడం కాస్త ఉపశమనాన్నిచ్చే అంశం. మరోవైపు, విమానయాన సంస్థలకు నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతంగా ఉండే ఏటీఎఫ్ ధర లీటరుకు రూ. 138.50కి పెరిగి వరుసగా నాలుగో నెల కూడా పెరుగుదలను నమోదు చేసుకుంది. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్‌లు , రూపాయి-డాలర్ మారకపు రేట్ల ఆధారంగా ప్రతి నెలా మొదటి తేదీన జరిగే ఈ సమీక్షల ధరలు, స్థానిక వ్యాట్ పన్నుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో స్వల్ప తేడాలతో అందుబాటులోకి రానున్నాయి.




