Mallikarjun Kharge: కేంద్రంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తీవ్ర విమర్శలు.. ‘సామాన్యుడి పొదుపుపై పెట్రోల్ చల్లుతున్నారు’!
Mallikarjun Kharge: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Mallikarjun Kharge: కేంద్రంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తీవ్ర విమర్శలు.. ‘సామాన్యుడి పొదుపుపై పెట్రోల్ చల్లుతున్నారు’!
Mallikarjun Kharge: దేశంలో రోజురోజుకు సామాన్యుడిపై భారంగా మారుతున్న ఇంధన ధరల (Fuel Hike) పెంపుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. "ఈ రోజువారీ చమురు దోపిడీ వల్ల అసలు ఎవరు లాభపడుతున్నారు?" అని ఖర్గే నిలదీశారు. సామాన్య ప్రజలు దాచుకున్న పొదుపు మొత్తాన్ని తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోందంటూ ఆయన ట్విట్టర్ (X) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు.
గత పన్నెండేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం కేవలం ఇంధనంపై పన్నుల రూపంలోనే ప్రజల నుంచి ఏకంగా రూ.43 లక్షల కోట్లు దోచుకుందని ఖర్గే దుయ్యబట్టారు. 2014లో దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.41 ఉంటే.. మోదీ సర్కారు దాన్ని రూ.102 దాటించిందని ఎద్దేవా చేశారు. గడిచిన రెండు వారాల లోపే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ఇది నాలుగోసారి అని, ఈ రోజువారీ ఇంధన దోపిడీ ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగోసారి పెరిగిన వెంటనే హెచ్‌పీసీఎల్ (HPCL), బీపీసీఎల్ (BPCL), ఐఓసీ (IOC) వంటి చమురు సంస్థల షేర్లు మార్కెట్లో వరుసగా 5.8 శాతం, 4.44 శాతం, 3.90 శాతం మేర లాభపడ్డాయని ఖర్గే గుర్తు చేశారు. ప్రజల అవసరాల కంటే కార్పొరేట్ సంస్థల లాభాలకే ప్రాధాన్యం ఇవ్వడం భాజపా నైజమని విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల దేశంలోని రైతుల నుంచి మొదలుకొని ఎంఎస్‌ఎంఈ (MSME) రంగాల వరకు, సమాజంలోని ప్రతి వర్గం భాజపా మోపిన ఈ దోపిడీ భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు.
నేడు మరోసారి పెరిగిన ఇంధన ధరలు: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నేడు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజా బాదుడుతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు చేరగా.. డీజిల్ ధర రూ.95.20కు చేరింది. ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో ఇంధన ధరలు మరింత మంటపుట్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.115.58 మార్కును తాకగా.. డీజిల్ ధర రూ.103.74గా రికార్డైంది. వరుస పెంపులతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు.




