Congress TVK Alliance Miss: తమిళనాడులో కాంగ్రెస్‌ మరోసారి చారిత్రక తప్పిదం...కాదన్నందుకు ఫలితం ఇదే

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. “కాంగ్రెస్ పార్టీ మరోసారి పప్పులో కాలేసిందా?” అని. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం ముందు దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీలు కుదేలయ్యాయి.

Balachander
Published on: 4 May 2026 2:37 PM IST
Congress TVK Alliance Miss: తమిళనాడులో కాంగ్రెస్‌ మరోసారి చారిత్రక తప్పిదం...కాదన్నందుకు ఫలితం ఇదే
X

Congress TVK Alliance Miss: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. “కాంగ్రెస్ పార్టీ మరోసారి పప్పులో కాలేసిందా?” అని. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం ముందు దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీలు కుదేలయ్యాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు విజయ్ పంపిన స్నేహ హస్తాన్ని కాంగ్రెస్ తిరస్కరించడమే ఆ పార్టీ పాలిట శాపమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని టీవీకే కార్యాలయం వద్ద, ప్రశాంత్ కిషోర్ బృందంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

ప్రశాంత్ కిషోర్ సంచలన విశ్లేషణ

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌. తాజాగా తమిళనాడులో వస్తున్న ఫలితాలపై ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకే తుది ఫలితాల్లో 128 నుంచి 135 స్థానాలు వస్తాయని చెబుతున్నారు. విజయ్‌ టీవీకే పార్టీకి ఎవరి మద్దతు అవసరం ఉండబోదని, సొంతంగానే పీఠాన్ని అధిరోహిస్తారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ తమిళనాడులో కొలుకునే అవకాశాన్ని చేజేతులారా కోల్పోయిందని ప్రశాంత్‌ కిషోర్‌ పేర్కొన్నారు. దీనిని ఆయన కర్మసిద్దాంతంగా చెప్పుకొచ్చారు.

ఏమిటా ‘పొత్తు’ డ్రామా?

విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపారు. తమిళనాడులో తమతో పొత్తు పెట్టుకోవాలని, 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారు. ఇదే విషయాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ గతంలో ప్రియాంక గాంధీకి కూడా వివరించినట్టు తెలిపారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ అప్పటికే డీఎంకేతో పొత్తు ఉన్నది. ఆ బంధాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్దపడలేదు. అంతేకాదు, స్థానిక కాంగ్రెస్‌ నేతలు కూడా హైకమాండ్‌ ఒత్తిడికి తలొగ్గి విజయ్‌ని నమ్మలేదు. డీఎంకేతో పొత్తు పెట్టుకున్నది. ఈ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీ రెండూ ఓటమి అంచుల్లో కూరుకుపోయాయి.

ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న దారి ఏమిటి?

ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ 118 కి కొంచెం దూరంలో ఆగిపోతే, కాంగ్రెస్ పార్టీ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. డీఎంకే ఓడిపోయిన పక్షంలో... గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు టీవీకే ప్రభుత్వానికి మద్దుతు ఇవ్వొచ్చు. ఈ విధంగా టీవీకేతో పొత్తు పెట్టుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి తమిళనాడులో మనుగడ లభించే అవకాశం ఉంటుంది. లేదు..డీఎంకేతోనే బంధాన్ని కొనసాగిస్తే... విజయ్‌ టీవీకే...పీఎంకే లేదా ఇతర చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.

మొత్తంగా చూసుకుంటే కనుక, రాజకీయాల్లో టైమింగ్‌ అన్నది చాలా ముఖ్యం. విజయ్‌ వేసిన మాస్టర్‌ ప్లాన్‌ను కాంగ్రెస్‌ పార్టీ తక్కువగా అంచనా వేసింది. తద్వారా భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది. విజయ్‌ చెప్పినట్లు 60 సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసి ఉంటే, నేడు తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీ కింగ్‌ మేకర్‌ అయ్యేది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story