Gaurav Gogoi: విద్యార్థులు పోరాడుతుంటే మోదీ రీల్స్ చేస్తున్నారు: గౌరవ్ గొగోయ్ ఫైర్!

Gaurav Gogoi: లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్ర విమర్శలు.

Arun Chilukuri
Published on: 28 July 2026 4:37 PM IST
Gaurav Gogoi
X

Gaurav Gogoi: విద్యార్థులు పోరాడుతుంటే మోదీ రీల్స్ చేస్తున్నారు: గౌరవ్ గొగోయ్ ఫైర్!

Gaurav Gogoi: లోక్‌సభలో యాంటీ-పేపర్‌ లీక్‌ సవరణ బిల్లుపై జరుగుతున్న చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీతో విద్యార్థులు, యువత తమ భవిష్యత్తు కోసం రోడ్లపై పోరాటాలు చేస్తుంటే.. ప్రధాని మోదీ మాత్రం సమస్యను పట్టించుకోకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు.

దేశంలో పేపర్ లీకేజీల సమస్య తీవ్రంగా ఉంటే, ప్రభుత్వం సమస్య పరిష్కారంపై కాకుండా ప్రచారాలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతోందని గొగోయ్ విమర్శించారు. లీకేజీలను అరికట్టేందుకు 2024లో తీసుకొచ్చిన చట్టం నిజంగానే కఠినంగా ఉంటే.. మళ్లీ పేపర్‌ లీక్‌లు ఎలా జరిగాయో సమాధానం చెప్పాలని నిలదీశారు.

ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను పరిశీలిస్తే వ్యవస్థలో అర్థవంతమైన మార్పులు తీసుకురావాలనే చిత్తశుద్ధి కేంద్రానికి లేదని స్పష్టమవుతోందన్నారు. కేంద్రం చేపడుతున్న పరీక్షా సంస్కరణలు కేవలం కంటితుడుపు చర్యలు మాత్రమేనని, గతంలో కూడా ఇలాంటి హామీలే ఇచ్చి విఫలమయ్యారని పేర్కొన్నారు.

2024 నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ జరిగినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న విషయాన్ని గొగోయ్ గుర్తు చేశారు. ఆ సమయంలో లీకేజీయే జరగలేదని నిజాన్ని కప్పిపుచ్చేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారని దుయ్యబట్టారు. అటువంటి నేతకు బీజేపీ సభ్యులు పార్లమెంట్‌లో ఘన స్వాగతం పలకడాన్ని తప్పుపట్టారు.

అక్రమాలకు వ్యతిరేకంగా, తమ హక్కుల కోసం పోరాట స్ఫూర్తిని చాటిన విద్యార్థులకు గొగోయ్ ధన్యవాదాలు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థుల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని, పోలీసులతో విద్యార్థుల తలలపై కొట్టించారని ఆరోపించారు. అలా కొట్టాలని పోలీసులను ఎవరు ఆదేశించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story