Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. 25 మందికి ఉద్వాసన.. తెలంగాణ, ఏపీ బాధ్యతలు ఎవరికి దక్కాయంటే?
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో భారీ సంస్థాగత మార్పులు చేపట్టింది. AICCలో 25 మంది కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించింది.
Congress
Congress: కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు కలకలం రేపుతున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)లో భారీ స్థాయిలో మార్పులు చేస్తూ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 25 మంది కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించింది. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పార్టీ విభాగాలకు కలిపి 81 మందికి బాధ్యతలు కేటాయించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మార్పులకు ఆమోదం తెలిపారు. కొత్త నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ ప్రకటించింది.
2027 ఎన్నికలే లక్ష్యంగా మార్పులు?
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఈ మార్పులు చేపట్టినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కొత్త బాధ్యతలు అప్పగించే ముందు పార్టీ నాయకత్వం రాష్ట్రాల వారీగా కార్యదర్శుల పనితీరును సమీక్షించినట్లు సమాచారం. సెప్టెంబర్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ 64 మంది AICC కార్యదర్శులతో సమావేశమై వారి పనితీరు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించినట్లు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.
యూపీకి ఆరుగురు.. రాజస్థాన్‌కు నలుగురు
కొత్త జాబితాలో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా ఆరుగురికి బాధ్యతలు అప్పగించారు. అభిషేక్ దత్, వరుణ్ చౌదరి, కునాల్ చౌదరి, జగదీశ్ చందర్ జాంగిడ్, అబ్దుల్ హన్నాన్, సంజీవ్ ఆర్యలకు అక్కడి బాధ్యతలు కొనసాగించారు. రాజస్థాన్‌కు విశ్వ విజయ్ సింగ్, పోర్లాక్ ఖార్తే, డాక్టర్ పాలక్ వర్మ, మనోజ్ బాగ్రీలను నియమించారు. గుజరాత్, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కూడా నలుగురి చొప్పున కార్యదర్శులను కేటాయించారు.
తెలంగాణ, ఏపీ బాధ్యతలు ఎవరికి?
తెలంగాణలో పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్‌లకు బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు అండమాన్ నికోబార్ దీవుల బాధ్యతలను సెంథిల్ అరసు, వీ. శంకర్లకు కేటాయించారు. ఢిల్లీ బాధ్యతలను డానిష్ అబ్రార్‌కు అప్పగించారు. ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు కొత్తగా బాధ్యతలు పంపిణీ చేశారు.
25 మంది జాబితాలో ఎవరెవరు?
ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించిన వారిలో అంబా ప్రసాద్, బి.ఎం.సందీప్, చేతన్ చౌహాన్, చిరంజీవ్ రావు, క్రిస్టోఫర్ తిలక్, దేవేందర్ యాదవ్, దివ్య మదేర్నా, మన్సూర్ అలీ ఖాన్ ఉన్నారు. వీరితో పాటు నవీన్ శర్మ, పి.గోపీ, పి.విశ్వనాథన్, పృథ్వీరాజ్ సాఠే, పూనమ్ పాస్వాన్, రోజీ ఎం.జాన్, రుత్విక్ మక్వానా, ఎస్.ఏ. సంపత్ కుమార్, సంజనా జాతవ్, షానవాజ్ ఆలం, టి.ఎన్. ప్రతాపన్, ఉషా నాయుడు, విజయ్ జాంగిడ్లను కూడా తప్పించారు. వీరితో పాటు వి.కె. అరివళగన్, విదిత్ చౌదరి, మాథ్యూ ఆంటోనీ, రణ్విజయ్ సింగ్ లోచవ్ పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.
కీలక విభాగాల్లో పాతవారికే బాధ్యతలు
పార్టీ ప్రచారం, మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విభాగాల్లో డాక్టర్ వినీత్ పునియా, రుచిరా చతుర్వేదిల బాధ్యతలను కొనసాగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడి కార్యాలయ బాధ్యతలను మరోసారి ప్రణవ్ ఝా, గౌరవ్ పాంధీలకు అప్పగించారు. పరిపాలన, శిక్షణ, విదేశీ వ్యవహారాలు, పార్టీ ఆస్తుల నిర్వహణ వంటి విభాగాలకు కూడా ప్రత్యేకంగా కార్యదర్శులను నియమించారు. ఈ మార్పులతో రాష్ట్రాల్లో పార్టీ సమన్వయం, సంస్థాగత పనితీరు మెరుగుపడుతుందనే ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది.




