Supreme Court: బలవంతంగా తల్లిని చేయలేరు: అబార్షన్ హక్కులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
Supreme Court: అవాంఛిత గర్భం విషయంలో మహిళల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
Supreme Court
Supreme Court: అవాంఛిత గర్భం విషయంలో మహిళల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. 15 ఏళ్ల బాలిక ఏడు నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతినిస్తూ, పుట్టబోయే బిడ్డ కంటే తల్లిగా మారబోయే సదరు మహిళ తీసుకునే నిర్ణయానికే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రాజ్యాంగ హక్కుల పరిరక్షణే ప్రాధాన్యం
భారత అత్యున్నత న్యాయస్థానం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ , శారీరక స్వయంప్రతిపత్తిపై చారిత్రాత్మక వ్యాఖ్యలు చేసింది. ఇష్టం లేకుండా ఒక మహిళను, మరీ ముఖ్యంగా మైనర్ బాలికను గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేసే హక్కు ఏ న్యాయస్థానానికి లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఘంటాపథంగా చెప్పింది. అవాంఛిత గర్భాన్ని కొనసాగించమని ఒత్తిడి చేయడం అంటే సదరు మహిళ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని కోర్టు అభిప్రాయపడింది.
మానసిక ఆరోగ్యం , భవిష్యత్తుపై ప్రభావం
ఈ కేసులో బాధితురాలు కేవలం 15 ఏళ్ల బాలిక కావడంతో కోర్టు మానసిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఇష్టం లేని గర్భాన్ని మోయడం వల్ల ఆ బాలిక మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, ఆమె విద్యావకాశాలు , సామాజిక స్థితిగతులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందని న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గర్భాన్ని కొనసాగించడం ఇష్టం లేక సదరు బాలిక ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది.
చట్టవిరుద్ధమైన అబార్షన్ల ముప్పు
కోర్టులు అవాంఛిత గర్భాలను తొలగించడానికి అనుమతి నిరాకరిస్తే జరిగే పరిణామాలను కూడా ధర్మాసనం వివరించింది. న్యాయపరమైన రక్షణ లభించని పక్షంలో మహిళలు ప్రాణాలకు తెగించి చట్టవిరుద్ధంగా నడిచే అబార్షన్ కేంద్రాలను ఆశ్రయిస్తారని, ఇది వారి ప్రాణాలను మరింత ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని కోర్టు హెచ్చరించింది. రహస్యంగా గర్భవిచ్ఛిత్తికి పాల్పడటం వల్ల తలెత్తే అనర్థాలను నివారించాలంటే చట్టం అండగా ఉండాలని కోర్టు పేర్కొంది.
మానవీయ కోణంలో తీర్పు
పుట్టబోయే బిడ్డ హక్కుల కంటే గర్భం దాల్చిన మహిళ శారీరక , మానసిక క్షేమమే ముఖ్యమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. ఒక బిడ్డకు జన్మనిచ్చే విషయంలో నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ మహిళకే ఉండాలని కోర్టు పునరుద్ఘాటించింది.




