CRPF Raising Day: సీఆర్‌పీఎఫ్‌ రైజింగ్‌ డే... దేశ రక్షణలో కీలక దళం... అమరజవాన్లకు దేశం వందనం

దేశ రక్షణ కోసం నిరంతరం పాటుబడే దళం సీఆర్‌పీఎఫ్‌. జులై 27న ఈ సెంట్రల్‌ రిజర్వ్‌ ఫోర్స్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. శాంతిని నెలకొల్పేందుకు ఈ దళం కృషి చేస్తుంది.

Balachander
Published on: 27 July 2026 8:46 AM IST
CRPF Raising Day: సీఆర్‌పీఎఫ్‌ రైజింగ్‌ డే... దేశ రక్షణలో కీలక దళం... అమరజవాన్లకు దేశం వందనం
X

CRPF Raising Day: దేశ రక్షణ, అంతర్గత భద్రతలో అత్యంత కీలకమైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ప్రతి సంవత్సరం జూలై 27న తన ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో గర్వంతో జరుపుకుంటుంది. సరిహద్దుల్లో శత్రువులను తిప్పికొట్టడం నుంచి, అడవుల్లో శాంతిని నెలకొల్పడం వరకు ఈ బలగం అహర్నిశలు అందిస్తున్న సేవలు వర్ణనాతీతం.

ఒక్క బెటాలియన్ నుంచి 3.25 లక్షల జవాన్ల శక్తిగా..

బ్రిటిష్ కాలంలో 1939 జూలై 27న మధ్యప్రదేశ్‌లోని నీముచ్ కేంద్రంగా కేవలం ఒకే ఒక్క బెటాలియన్‌తో 'క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్' పేరిట ఈ దళం ప్రారంభమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చూపిన చొరవతో, 1949 డిసెంబర్ 28న పార్లమెంట్ చట్టం ద్వారా ఇది 'సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్' గా రూపాంతరం చెందింది. అనతికాలంలోనే విస్తరించిన ఈ బలగంలో నేడు దాదాపు 248కి పైగా బెటాలియన్లు, 3.25 లక్షలకు పైగా జవాన్లు రాత్రింబవళ్లు దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటివరకు దేశ రక్షణ పోరాటాల్లో 2,268 మంది అధికారులు, జవాన్లు తమ ప్రాణాలను అర్పించి అమరులయ్యారు.

చరిత్ర పుటల్లో నిలిచిన శౌర్య ఘట్టాలు

లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద 16,000 అడుగుల ఎత్తులో చైనా దళాల ఆకస్మిక దాడిని ఎదుర్కొని 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. వారి త్యాగానికి గుర్తుగానే ఏటా అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా 'పోలీస్ సంస్మరణ దినోత్సవం' జరుపుకుంటారు. అంతేకాదు, గుజరాత్‌లోని కచ్ రణ్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక బ్రిగేడ్‌ను సీఆర్‌పీఎఫ్ చిన్న బెటాలియన్ ధీటుగా ఎదుర్కొని తిప్పికొట్టింది. ఈ చారిత్రక విజయానికి గుర్తుగా ఏప్రిల్ 9ని 'శౌర్య దివాస్'గా నిలుపుకున్నారు. ఈ రెండు ఘటనలు దేశ సైనిక వ్యవస్థ పటుత్వాన్ని చాటిచెబుతోంది.

ప్రత్యేక విభాగాలు - విశిష్ట సేవలు

అడవుల్లో గెరిల్లా పోరాటాలు చేసే మావోయిస్టులను ఎదుర్కొనేందుకు 2008లో 10 ప్రత్యేక కోబ్రా బెటాలియన్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు, నగరాల్లో అల్లర్లు, వర్గపోరు జరిగినప్పుడు శాంతిభద్రతలను కాపాడేందుకు 1992లో ఈ నీలి రంగు యూనిఫాం దళం ర్యాపిడ్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. 1986లోనే ఆసియాలోనే మొదటి మహిళా సాయుధ పోలీస్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసి సీఆర్‌పీఎఫ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇలా దేశంలో ఎక్కడ ఎలా అవసరమైతే అక్కడ ఆ విధంగా సేవలు, పోరాటం చేసేందుకు సీఆర్‌పీఎఫ్‌ దళం సదా సిద్దంగా ఉంటుంది. అంతేకాదు, అంతర్గత అలజడులను అణచడమే కాకుండా, సార్వత్రిక ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించడంలోనూ, తుఫాన్లు, వరదల వేళ ప్రాణరక్షణ చేయడంలోనూ సీఆర్‌పీఎఫ్ పోషిస్తున్న పాత్ర అసాధారణమైనది. దేశం ప్రశాంతంగా నిద్రపోతుందంటే, ఆ అభయం వెనుక ఈ రిజర్వ్ జవాన్ల నిరంతర త్యాగం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. జులై 27న సీఆర్‌పీఎఫ్‌ రైజిండ్‌ సందర్భంగా అమర జవాన్లను తలచుకుందాం. వారి త్యాగాలను గుర్తుచేసుకుందాం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story