Cyclone Murasu: ఏపీకి మరో ముప్పు.. పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవులు జారీ!

Cyclone Murasu: 'అర్నాబ్' తుఫాను సృష్టించిన నష్టం నుంచి కోలుకోకముందే ఏపీ, ఒడిశాలను మురసు తుఫాను వణికిస్తోంది.

Gagan kumar
Published on: 2 Nov 2026 7:22 AM IST
Cyclone Murasu
X

Cyclone Murasu: ఏపీకి మరో ముప్పు.. పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవులు జారీ!

Cyclone Arnab: ఆంధ్రప్రదేశ్, ఒడిశాలను 'అర్నాబ్' తుఫాను అతలాకుతలం చేసి వారం రోజులు కూడా గడవకముందే.. బంగాళాఖాతంలో మరో తీవ్ర తుఫాను రూపుదిద్దుకుంది. అక్టోబర్ చివరి వారంలో విరుచుకుపడిన ప్రకృతి కోపానికి ఆంధ్రా, ఒడిశాలు కోలుకోకముందే, ఇప్పుడు 'మురసు' రూపంలో మరో పెద్ద ముప్పు తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. వారం వ్యవధిలోనే రెండు తుఫానులు విరుచుకుపడుతుండటంతో తీర ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫానుకు భారతదేశం సూచించిన 'మురసు' అనే పేరును ఖరారు చేశారు.

వేగంగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. నవంబర్ 3న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు – నర్సాపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీస్తాయని, ఇవి గంటకు 120 కిమీ వేగానికి చేరవచ్చని హెచ్చరించారు. నవంబర్ 2 నుంచే ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో వర్షాలు ప్రారంభమవుతాయి. నవంబర్ 3, 4 తేదీలలో ఈ వర్షాలు అత్యంత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు.

గత వారం వచ్చిన 'అర్నాబ్' తుఫాను కారణంగా ఇప్పటికే ఒడిశాలోని గంజాం, కంధమాల్ జిల్లాలతో పాటు ఏపీలోని పలు కోస్తా జిల్లాలు దెబ్బతిన్నాయి. దాదాపు 1.18 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు కాగా, వేలాది హెక్టార్లలో పంట నీట మునిగింది. ఇప్పుడు ఆ గాయాలు మానకముందే మరో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

తుఫాను ముప్పు తీవ్రంగా ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఈరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు , అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆదేశాలను ధిక్కరించి విద్యాసంస్థలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఇళ్లలోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు విజ్ఞప్తి చేశారు.

వరుస తుఫానుల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం సహాయక దళాలను ముందస్తుగా తీర జిల్లాల్లో మోహరించారు. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనున్న ఈ మురసు తుఫాను ఎంతటి విలయాన్ని సృష్టిస్తుందోనని కోస్తాంధ్ర ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.