Food Poisoning : దహీ వడ తిని ఒకే గ్రామానికి చెందిన 58 మంది ఆస్పత్రి పాలు.. ఒకరు మృతి
Food Poisoning : ఒడిశాలోని జజూపూర్ లో కలుషిత పెరుగు వడ తిని 58 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక వృద్ధురాలు మృతి చెందగా, 25 మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Food Poisoning
Food Poisoning : ఒడిశాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇష్టంగా తిన్న టిఫిన్ ప్రాణాల మీదకు తెచ్చింది. రోడ్డు పక్కన అమ్మే దహీ వడ తిని ఏకంగా 58 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఒక వృద్ధురాలు పరిస్థితి విషమించి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒడిశాలోని జజూపూర్ జిల్లా దశరథ్‌పూర్ బ్లాక్ పరిధిలోని పాతపూర్ గ్రామంలో ఈ విషాదం వెలుగుచూసింది. శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:30 గంటల మధ్య గ్రామంలోకి వచ్చిన ఒక వీధి వ్యాపారి వద్ద గ్రామస్తులంతా ఇష్టంగా పెరుగు వడ కొనుక్కుని తిన్నారు. అయితే తిన్న కొద్దిసేపటికే వారిలో అసౌకర్యం మొదలైంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ వరుసగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. కడుపునొప్పితో బాధితులు విలవిలలాడటంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనలో ఒక వృద్ధురాలు చికిత్స పొందుతూ మరణించింది. ప్రస్తుతం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో 52 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మంది చిన్న పిల్లలు ఉండటం గమనార్హం. మరో ఆరుగురు బాధితులు గ్రామంలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. బాధితుల్లో కొందరికి తీవ్రమైన జ్వరం, తల తిరగడం వంటి లక్షణాలు ఉన్నాయని, పరిస్థితి విషమించకుండా వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాధితులందరి పరిస్థితి నిలకడగానే ఉందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ బిజయ్ కుమార్ మిశ్రా ధృవీకరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి ముకేష్ మహాలింగ్, జజూపూర్ ఎంపీ డాక్టర్ రవీంద్ర కుమార్ బెహరా వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. కలుషిత ఆహారం వల్లే ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. దీని వెనుక ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో బయటి ఆహారం త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెరుగుతో చేసిన పదార్థాలు, కూరలు త్వరగా పులిసిపోయి బ్యాక్టీరియా చేరుతుంది. రోడ్డు పక్కన అమ్మే ఆహార పదార్థాల నాణ్యతపై నిఘా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. రుద్ర నారాయణ అనే బాధితుడు మాట్లాడుతూ.. "మేమంతా రోజూ లాగే పెరుగు వడ తిన్నాం, కానీ ఈసారి అది విషపూరితం అవుతుందని ఊహించలేదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు బయటి తిండికి దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.




