Dancer: ప్రముఖ డ్యాన్సర్ నడుముపై చేయి వేసిన ఆకతాయి.. తర్వాత ఏం జరిగిందంటే..?
Dancer: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన. లైవ్ స్టేజ్ షోలో తన నడుముపై చేయి వేసిన ఆకతాయి చెంప చెల్లుమనిపించింది ప్రముఖ డ్యాన్సర్ డింపుల్ చౌదరి.
Dancer: ప్రముఖ డ్యాన్సర్ నడుముపై చేయి వేసిన ఆకతాయి.. తర్వాత ఏం జరిగిందంటే..?
Dancer Dimple Choudhary : సాధారణంగా రికార్డింగ్ డ్యాన్స్‌లు, స్టేజ్ షోలు అంటేనే ఒక సపరేట్ వైబ్ ఉంటుంది. చుట్టూ వేలల్లో జనం.. స్టేజ్‌పై డ్యాన్సర్లు సందడి చేయడం కామన్. అయితే, ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు హద్దులు మీరి మహిళా కళాకారులపై అసభ్యంగా ప్రవర్తించే ఘటనలు తరచూ వింటూనే ఉంటాం. చాలామంది అమ్మాయిలు భయపడి గమ్మున ఉండిపోతారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో ఓ లేడీ డ్యాన్సర్ మాత్రం అలా చేయలేదు. తన నడుముపై చేయి వేసి వెకిలిగా ప్రవర్తించిన ఒక పోకిరీకి వేదికపైనే అందరి ముందు దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పింది. ప్రస్తుతం ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఉత్తర ప్రదేశ్‌లోని హాథరస్ జిల్లా సాస్ని పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. హర్యానాకు చెందిన ప్రముఖ స్టేజ్ డాన్సర్ డింపుల్ చౌదరి ఇక్కడి ఒక పుట్టినరోజు వేడుకలో షో ఇచ్చేందుకు వచ్చింది. ఆమె స్టేజ్‌పై పాటలకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఎరుపు రంగు క్యాప్ ధరించిన సురేష్ కుమార్ అనే స్థానిక యువకుడు స్టేజ్ పైకి ఎక్కాడు. ఆమె చుట్టూ తిరుగుతూ కాసేపు హడావుడి చేశాడు. అంతటితో ఆగకుండా, మర్యాదలు అతిక్రమించి అకస్మాత్తుగా డింపుల్ నడుముపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు.
సురేష్ అలా చేయి వేయడమే ఆలస్యం.. డింపుల్‌కు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. ఏమాత్రం భయపడకుండా వెంటనే వెనక్కి తిరిగి, ఆ పోకిరీ సురేశ్ చెంప పగిలేలా గట్టిగా కొట్టింది. ఆమె కొట్టిన దెబ్బకు ఆ యువకుడు, చుట్టూ ఉన్న జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతటితో ఆమె ఆగలేదు. వెంటనే మైక్ అందుకుని అందరి ముందే.. మర్యాదగా ఉండటం నేర్చుకో.. నడుంపై చేయి వేస్తే ఒక్క నిమిషంలో నీ దుమ్ము దులుపుతా అంటూ స్టేజ్‌పైనే లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది. తనపై జరిగిన ఈ వేధింపునకు నిరసనగా ఆ కార్యక్రమాన్ని అక్కడికక్కడే ఆపేసి, వేదిక దిగి వెళ్లిపోయింది.
డింపుల్ ఆ పోకిరీని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలను అక్కడున్న కొందరు తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ధైర్యంగా ఆకతాయికి బుద్ధి చెప్పిన డింపుల్ చౌదరిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అమ్మాయిలంటే అలానే ఉండాలి.. తప్పు చేస్తే అక్కడికక్కడే కొట్టాలి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు దీనిని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టారు. మహిళా కళాకారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు సురేష్ కుమార్‌ను సాస్ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.




