Rajasthan: ఉద్యోగం కోసం కన్నతల్లిని చంపించిన కూతురు.. రాజస్థాన్‌లో ఘోరం!

Rajasthan: రాజస్థాన్‌లో ఆస్తి, ఉద్యోగం కోసం కన్నతల్లిని చంపించిన కూతురి ఘాతుకం వెలుగులోకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 8 July 2026 12:43 PM IST
Rajasthan
X

Rajasthan: ఉద్యోగం కోసం కన్నతల్లిని చంపించిన కూతురు.. రాజస్థాన్‌లో ఘోరం!

Rajasthan: ఆస్తి పిచ్చి, ఉద్యోగంపై మోజు మనుషుల మధ్య బంధాలను ఎంతలా దిగజారుస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. తండ్రి మరణానంతరం తల్లికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబ ఆస్తి మొత్తం తనకే దక్కాలనే దుర్బుద్ధితో ఒక కుమార్తె కన్నతల్లి ప్రాణాలనే తీయించింది. తల్లి హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసుల కళ్లు గప్పాలని చూసిన సదరు యువతి పాపం పండి చివరకు కటకటాలపాలైంది. రాజస్థాన్‌లోని ప్రతాప్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

రాజస్థాన్‌ ప్రతాప్‌నగర్‌లోని రవీంద్రనగర్‌కు చెందిన నీరజ్‌ శర్మ (45) అనే మహిళ భర్త ఏడాది క్రితం మరణించారు. భర్త మరణానంతరం ఆమెకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్టులో కారుణ్య నియామకం కింద లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగం లభించింది. అయితే, తండ్రి చనిపోవడంతో ఆ ఉద్యోగం కారుణ్య నియామకం కింద తనకే రావాలని ఆమె కుమార్తె ఆయుషి ఆశపడింది. కానీ, తల్లి నీరజ్ శర్మ అందుకు ఒప్పుకోకపోవడంతో ఆయుషి మనసులో తల్లిపై తీవ్రమైన కక్ష, క్రోధం పెంచుకుంది.

కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, భర్త చనిపోయాక తల్లి పేరు మీద ఉన్న కుటుంబ ఆస్తి మొత్తం తనకే దక్కాలని ఆయుషి భావించింది. తల్లి బ్రతికుంటే ఇది సాధ్యం కాదని గ్రహించిన ఆమె, ఎలాగైనా తల్లిని వదిలించుకోవాలని స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే తమ సమీప బంధువులైన మరో ఆరుగురితో చేతులు కలిపి తల్లిని హతమార్చడానికి కుట్ర పన్నింది.

ఈ నెల 23న ప్రణాళిక ప్రకారం నీరజ్ శర్మ రోడ్డుపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన నీరజ్ శర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమికంగా ఇది హిట్ అండ్ రన్ కేసు (రోడ్డు ప్రమాదం) లాగే అందరూ భావించారు.

అయితే ఈ ప్రమాదంపై నీరజ్ శర్మ సోదరుడు రాకేశ్‌కు తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన సోదరి మరణం వెనుక ఏదో కుట్ర ఉందని భావించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని టెక్నికల్ సమాచారం, సీసీటీవీ విజువల్స్ మరియు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల శైలి విచారణలో అసలు నిజాలు బయటపడటంతో అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు. ఆయుషి తన బంధువులతో కలిసి కన్నతల్లిని చంపడానికి పక్కా ప్లాన్ వేసి, కారుతో గుద్దించి హత్య చేయించిందని దర్యాప్తులో తేలింది.

ఈ దారుణ కుట్రను ఛేదించిన పోలీసులు.. ప్రధాన నిందితురాలు ఆయుషితో పాటు ఆమెకు సహకరించిన బంధువులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ రంజిత్‌ శర్మ వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story