గర్భిణికి ఇచ్చిన పోషకాహార ప్యాకెట్‌లో చనిపోయిన పాము పిల్ల.. కలెక్టర్ సీరియస్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని పాంధుర్ణా జిల్లాలో ఒక అంగన్‌వాడీ కేంద్రం నిర్లక్ష్యం తీవ్ర కలకలం రేపింది. ఓ గర్భిణికి పంపిణీ చేసిన పోషకాహార ప్యాకెట్‌లో చనిపోయిన పాము పిల్ల కనిపించడం సంచలనంగా మారింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని పాంధుర్ణా జిల్లాలో మానవత్వాన్ని, విధులను మరువచేసే ఒక ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రంలో ఓ గర్భిణికి పంపిణీ చేసిన పోషకాహార (ఆహార లడ్డూలు/మిశ్రమం) ప్యాకెట్‌లో చనిపోయిన పాము పిల్ల కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురైన గర్భిణి కుటుంబీకులు, గ్రామస్థులు తక్షణమే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
పాంధుర్ణా జిల్లా కర్ఘాట్ కామతీ గ్రామానికి చెందిన ఒక గర్భిణి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో ఇటీవల కొన్ని పోషకాహార ప్యాకెట్‌లను తీసుకున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ ప్యాకెట్‌ను తెరిచి చూడగా, అందులో చనిపోయిన పాము పిల్ల ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు, గ్రామస్థులతో కలిసి పెద్ద ఎత్తున అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు, పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ అధికారులు, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు. గర్భిణుల ఆరోగ్యంతో ఆడుకునే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్‌వాడీ కేంద్రం బాధ్యులకు, పర్యవేక్షక అధికారులకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఈ దారుణానికి గల కారణాలపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించడం కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ వివాదాస్పద ఆహార ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకొని, దాని నమూనాలను లాబొరేటరీ టెస్టింగ్‌కు పంపించామని.. ల్యాబ్ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.




