Public Trust Bill 2026 : చిన్న చిన్న తప్పులకు ఇక జైలు శిక్ష ఉండదు.. పబ్లిక్ ట్రస్ట్ బిల్లుకు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
Public Trust Bill 2026 : భారత పార్లమెంట్ సామాన్యులకు ఊరటనిచ్చేలా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి, ప్రజల దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి చట్టపరమైన చిక్కులను తొలగించడానికి పబ్లిక్ ట్రస్ట్ (సవరణ) బిల్లు, 2026కు ఆమోదం తెలిపింది
Public Trust Bill 2026
Public Trust Bill 2026 : దేశంలో కోర్టుల చుట్టూ తిరిగే లక్షలాది మందికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 79 కేంద్ర చట్టాల్లోని 784 సెక్షన్లను సవరిస్తూ తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లుతో దాదాపు వెయ్యి రకాల చిన్నపాటి నేరాలను నేరరహితం చేశారు. అంటే, చిన్న పొరపాట్లు చేసినప్పుడు ఇకపై పోలీసులు అరెస్ట్ చేయడం, నెలల తరబడి జైలులో ఉంచడం వంటివి ఉండవు. దీనివల్ల ప్రజలు అనవసరమైన భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే అవకాశం కలుగుతుంది. కేవలం జరిమానా చెల్లించడం లేదా హెచ్చరికలతోనే ఇటువంటి కేసులు ముగిసిపోతాయి.
మెట్రోలో సిగరెట్ తాగినా.. కాలుష్యం చేసినా..
సాధారణంగా మెట్రో రైళ్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం, అనుకోకుండా వాయు లేదా శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించడం వంటి వాటికి గతంలో కఠిన శిక్షలు ఉండేవి. అయితే కొత్త చట్టం ప్రకారం.. మొదటిసారి ఇటువంటి తప్పులు చేస్తే కేవలం జరిమానా లేదా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఒకవేళ అదే తప్పును పదే పదే పునరావృతం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఈ మార్పుల వల్ల చిన్న చిన్న గొడవలు, వివాదాల కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తప్పుతుంది.
5 కోట్ల పెండింగ్ కేసులకు మోక్షం
మన దేశంలోని వివిధ కోర్టుల్లో సుమారు 5 కోట్ల చిన్నపాటి కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. అసలు కోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం లేని ఇటువంటి కేసులను గుర్తించి, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. పాత కేసుల్లో ఉన్న వారు కూడా ఈ కొత్త నిబంధనల ప్రకారం ఊరట పొందవచ్చు. దీనివల్ల న్యాయమూర్తులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, పెద్ద పెద్ద నేరాలపై దృష్టి సారించే అవకాశం కలుగుతుంది.
నిబంధనల్లో వచ్చిన ప్రధాన మార్పులు
ఈ సవరణ బిల్లు ద్వారా శిక్షల విషయంలో స్పష్టమైన వర్గీకరణ చేశారు. ముఖ్యంగా 57 సెక్షన్లలో జైలు శిక్షను పూర్తిగా రద్దు చేసి, కేవలం జరిమానాకే పరిమితం చేశారు. మరో 158 సెక్షన్లలో విధిస్తున్న జరిమానా మొత్తాన్ని గణనీయంగా తగ్గించారు. అలాగే 17 రకాల కేసుల్లో శిక్షా కాలాన్ని తగ్గించగా, 113 కేసుల్లో జైలు, జరిమానా రెండూ ఉండకుండా కేవలం సాధారణ శిక్షతోనే సరిపెట్టేలా మార్పులు చేశారు.




