Delhi Air Pollution: దీపావళి తర్వాత ఢిల్లీలో విషవాయువులు.. ఊపిరి పీల్చుకోవడమే కష్టం

దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. నగర సగటు ఏక్యూఐ 373గా నమోదవగా, వివేక్ విహార్‌లో 442, సోనియా విహార్‌లో 463 నమోదయ్యాయి.

CR Reddy
Published on: 9 Nov 2026 6:39 AM IST
Delhi Air Pollution
X

Delhi Air Pollution

Delhi Air Pollution: దీపావళి సంబరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. రాత్రంతా భారీగా పటాకులు పేల్చడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ ప్రజలకు దీపావళి తర్వాత పరిస్థితి మరింత కష్టంగా మారింది. తాజా గణాంకాల ప్రకారం సోమవారం ఉదయం ఢిల్లీ మొత్తం సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 373గా నమోదైంది. ఇది చాలా అధ్వాన్నం కేటగిరీ. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏక్యూఐ 400 దాటడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.

వివేక్ విహార్‌లో 442

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB), EWS తాజా వివరాల ప్రకారం ఢిల్లీలోని వివేక్ విహార్‌లో ఏక్యూఐ 442గా నమోదైంది. ఐటీఓలో 407, ఎన్‌ఎస్‌ఐటీ ద్వారకలో 404 నమోదయ్యాయి. ఈ ప్రాంతాలన్నీ తీవ్రమైన కాలుష్య కేటగిరీలోకి వెళ్లాయి. వజీర్‌పూర్‌లో 393, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద 398, ఆర్‌కే పురంలో 388, మందిర్ మార్గ్‌లో 386, ఓఖ్లా ఫేజ్-2లో 364గా ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీ పరిధిలోనే కాకుండా పరిసర నగరాల్లోనూ కాలుష్యం పెరిగింది. ఆదివారం రాత్రి వరకు నోయిడాలో 319, ఘజియాబాద్‌లో 360, ఫరీదాబాద్‌లో 297, గురుగ్రామ్‌లో 280గా సగటు ఏక్యూఐ నమోదైంది.

నగరమంతా దట్టమైన పొగమంచు

దీపావళి రాత్రి పటాకుల మోత పెరిగే కొద్దీ ఢిల్లీలో పొగ కూడా భారీగా వ్యాపించింది. రోడ్లపై వీధి దీపాలు సైతం స్పష్టంగా కనిపించనంతగా పొగమంచు కమ్ముకుంది. రాత్రి 10 గంటల సమయంలో ఢిల్లీ సగటు ఏక్యూఐ 371గా నమోదైంది. నగరంలోని 20 పర్యవేక్షణ కేంద్రాల్లో గాలి నాణ్యత తీవ్రమైన స్థాయికి చేరింది. పటాకుల నుంచి వెలువడిన పొగ రోడ్లు, నివాస ప్రాంతాల్లో పేరుకుపోయింది. కాలిన మందుగుండు సామగ్రి వాసన గాలిలో వ్యాపించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తున్నాయని పలువురు స్థానికులు ఫిర్యాదు చేశారు.

నిషేధం ఉన్నా ఆగని బాణసంచా కాల్చడం

ఢిల్లీలో పటాకుల వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ దీపావళి రాత్రి పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చారు. పీతంపుర, బురారీ, మయూర్ విహార్, లుటియన్స్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టపాసులు పేల్చినట్లు సమాచారం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రీన్ క్రాకర్స్ అమ్మకం, వినియోగం విషయంలో నిబంధనలు పాటించాలని దీపావళికి ముందే ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. తూర్పు ఢిల్లీ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 7, 8 తేదీల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ బాణసంచా కాల్చడం కొనసాగింది.

సోనియా విహార్‌లో 463

దీపావళి రాత్రి నమోదైన గణాంకాల్లో సోనియా విహార్‌లో అత్యధికంగా 463 ఏక్యూఐ నమోదైంది. జహంగీర్‌పురిలో 450గా రికార్డయింది. బురారీ, అలీపూర్, పంజాబీ బాగ్ ప్రాంతాల్లోనూ కాలుష్యం తీవ్రంగా ఉంది. రాత్రి 10 గంటల సమయానికి గాలి నాణ్యతను పరిశీలించే 59 కేంద్రాల్లో 20 చోట్ల ఏక్యూఐ 400 దాటింది. మరో 33 కేంద్రాల్లో చాలా అధ్వాన్న స్థాయిలో ఉండగా, ఆరు కేంద్రాల్లో అధ్వాన్న స్థాయిలో నమోదైంది. CPCB ప్రమాణాల ప్రకారం 301-400 మధ్య ఏక్యూఐ ఉంటే 'చాలా అధ్వాన్నం', 401-500 మధ్య ఉంటే 'తీవ్రమైన కాలుష్యం'గా పరిగణిస్తారు. EWS అంచనాల ప్రకారం ఢిల్లీలో రానున్న రోజుల్లోనూ గాలి నాణ్యత తీవ్ర స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.