Delhi Air Pollution: ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్.. ఐదో తరగతి వరకు హైబ్రిడ్ క్లాసులు..
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా చుట్టుముడుతోంది. గాలి నాణ్యత పడిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పెరుగుతున్న కాలుష్య నియంత్రణలో భాగంగా అత్యవసర చర్యలకు ఉపక్రమించింది.
Delhi Air Pollution: ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్.. ఐదో తరగతి వరకు హైబ్రిడ్ క్లాసులు..
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా చుట్టుముడుతోంది. గాలి నాణ్యత పడిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పెరుగుతున్న కాలుష్య నియంత్రణలో భాగంగా అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మూడో విడత నిబంధనలు అమల్లోకి రావడంతో, ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య తీవ్రత దృష్ట్యా పాఠశాలల్లో 5వ తరగతి వరకు విద్యార్థులకు హైబ్రిడ్ విధానంలో (ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్) తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది.
ఎన్సీఆర్ జిల్లాలకూ వర్తించనున్న నిబంధనలు
ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శుక్రవారం ఓ వీడియో సందేశం ద్వారా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ ఆదేశాలు కేవలం ఢిల్లీకి మాత్రమే కాకుండా, నేషనల్ కేపిటల్ రీజియన్ (NCR) పరిధిలోని ప్రధాన జిల్లాలైన నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ , సోనిపట్ ప్రాంతాలకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ హైబ్రిడ్ తరగతుల విధానం కొనసాగుతుందని తెలిపారు.
తల్లిదండ్రుల ఇష్టానుసారం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్
కొత్త నిబంధనల ప్రకారం 5వ తరగతి వరకు చదువుతున్న చిన్నారులు పాఠశాలలకు నేరుగా వెళ్లవచ్చు లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా చదువుకోవచ్చు. ఈ వెసులుబాటు అందుబాటులో ఉన్న చోట ఏ విధానాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా విద్యార్థులు , వారి తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలేశారు. గాలి నాణ్యత సూచీ (AQI) శుక్రవారం నాటికి 382 వద్ద నమోదై 'చాలా పేలవమైన' (Very Poor) కేటగిరీలో కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో గాలి వేగం తగ్గితే కాలుష్య కణాలు మరింతగా భూమికి దగ్గరగా పేరుకుపోయే ప్రమాదం ఉందని, వాతావరణ పరిస్థితులు మరింత దిగజారవచ్చని హెచ్చరించారు.
వాహనాలపై కఠిన ఆంక్షలు
జీఆర్ఏపీ మూడో విడత ఆంక్షల్లో భాగంగా పాఠశాలలకే పరిమితం కాకుండా రవాణా రంగంపై కూడా కఠిన నిబంధనలు విధించారు. బీఎస్-3 (BS-III) లేదా అంతకంటే పాత పెట్రోల్ వాహనాలు, అలాగే బీఎస్-4 (BS-IV) లేదా అంతకంటే పాత డీజిల్ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఈ ఆంక్షలు ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఘజియాబాద్ , గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాల్లో ఖచ్చితంగా అమలవుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ నిబంధనలను పాటించి కాలుష్య నివారణకు సహకరించాలని కోరారు.




