Auto Cab Strike : మే 21 నుంచి మూడు రోజుల పాటు ఆటోలు, క్యాబ్‌లు బంద్.!

Auto Cab Strike : ఢిల్లీలో నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలపై కమర్షియల్ వాహన డ్రైవర్ల ఆగ్రహం ఒక్కసారిగా బయటపడింది.

G Krishna
Published on: 19 May 2026 1:17 PM IST
auto-cab
X

auto-cab

Auto Cab Strike : ఢిల్లీలో నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలపై కమర్షియల్ వాహన డ్రైవర్ల ఆగ్రహం ఒక్కసారిగా బయటపడింది. రాజధానిలోని ఆటో, ట్యాక్సీ, ఇతర వాణిజ్య వాహన డ్రైవర్ల సంఘాలు మే 21 నుంచి మే 23 వరకు మూడు రోజుల పాటు కంప్లీట్ సమ్మెను అనౌన్స్ చేశాయి. రోజురోజుకూ పెరుగుతున్న సీఎన్‌జీ, పెట్రోల్, డీజిల్ రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే ట్యాక్సీ, ఆటో ఛార్జీలను పెంచాలని ఈ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమ్మె కారణంగా మే 21 నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తోంది.

లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంలకు లేఖలు

ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ తమ డిమాండ్లను వివరిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధుతో పాటు ముఖ్యమంత్రి రేఖా గుప్తాలకు అఫీషియల్ గా లేఖలు రాసింది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో మధ్యతరగతి డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా మారిందని చాలక్ శక్తి యూనియన్ ఉపాధ్యక్షుడు అనుజ్ కుమార్ రాథోర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఢిల్లీలోని ఇతర రవాణా సంస్థల సహకారంతో మే 21, 22, 23 తేదీలలో వాహనాలేవీ రోడ్డుపైకి తీసుకురావద్దని డ్రైవర్లందరినీ కోరుతూ ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.

వారం రోజుల్లో తేలకపోతే ఆందోళన తీవ్రం

రాబోయే వారం లేదా రెండు వారాల్లోగా టాక్సీ, ఆటో ఛార్జీల పెంపుపై ప్రభుత్వం నుండి ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ రాకపోతే, ఈ ఆందోళనను మరింత పెద్ద ఎత్తున ముమ్మరం చేస్తామని యూనియన్లు గట్టిగా హెచ్చరించాయి. దీనివల్ల నగరంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా దానికి ఢిల్లీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు తేల్చి చెప్పారు. గత సంవత్సరం కూడా తాము తమ సమస్యలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, టాక్సీ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించి ఛార్జీలను పెంచాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైల్ ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్‌ వద్దకు పంపామని చెబుతూ ఢిల్లీ ప్రభుత్వం సాకులు వెతుకుతోందని, కావాలనే ఈ విషయాన్ని ఆలస్యం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

క్యాబ్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలపై ఆగ్రహం

మరోవైపు యాప్ ఆధారిత క్యాబ్ కంపెనీలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ డ్రైవర్లను దోపిడీ చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీలు కస్టమర్ల దగ్గర ఛార్జీలను నిరంతరం పెంచుతున్నప్పటికీ, డ్రైవర్లకు ఇచ్చే కమిషన్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయడం లేదని, దీనివల్ల ఢిల్లీ టాక్సీ డ్రైవర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతూ బానిసత్వం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని డ్రైవర్ల సంఘాలు అంటున్నాయి. యూనియన్ లెక్కల ప్రకారం గత 15 ఏళ్లుగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలో సిటీ టాక్సీ బేసిక్ ఛార్జీలు పెరగలేదు. కానీ ఇదే కాలంలో సీఎన్‌జీ, పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం కొన్ని రెట్లు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచకుండా తాము వాహనాలు నడపడం సాధ్యం కాదని, అందుకే ఈ మూడు రోజుల బంద్ పాటిస్తున్నామని డ్రైవర్ల సంఘాలు స్పష్టం చేశాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story