Education Ministry Office: కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక దస్త్రాలు అగ్నిఆహుతి!

Education Ministry Office: దేశ రాజధాని దిల్లీలోని కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

Arun Chilukuri
Published on: 1 Jun 2026 11:35 AM IST
Education Ministry Office
X

Education Ministry Office: కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక దస్త్రాలు అగ్నిఆహుతి!

Education Ministry Office: దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దిల్లీలోని వికాస్‌మార్గ్‌లో ఉన్న కేంద్ర విద్యాశాఖ (Education Ministry) పరిధిలోని ఓ కార్యాలయంలో సోమవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA) భవనంలోని రెండో అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పోలీసులు ధృవీకరించారు.

పోలీసులు మరియు విద్యాశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన భవనంలోని రెండో అంతస్తులో విద్యాశాఖకు చెందిన పలు కీలక విభాగాలు, ఉన్నతాధికారులు, అధ్యాపక సభ్యుల (Faculty Members) కేబిన్లు ఉన్నాయి. మంటల తీవ్రతకు అక్కడ దాచిన పలు ముఖ్యమైన దస్త్రాలు, ప్రభుత్వ పత్రాలు కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు.

కార్యాలయంలోని ఎయిర్ కండిషనర్ (AC) లో మొదట మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఎండల తీవ్రతకు ఏసీ ఓవర్‌హీట్ అయిందా లేదా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు ముగిశాయని, కార్యాలయంలో జరిగిన ఆస్తి నష్టం మరియు కాలిపోయిన ఫైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను అంచనా వేస్తున్నామని కేంద్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story